ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 492 కేసులు నమోదు అయ్యాయి. విశాఖ చిత్తూరు జిల్లాలో కరోనా వల్ల ఇద్దరు చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 168 కేసులు రికార్డయ్యాయి. ఏపీలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.
రాష్ట్రంలో మొత్తం కేసులు ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేలకు చేరాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 168 కేసులు రికార్డయ్యాయి. కృష్ణాజిల్లాలో 63, చిత్తూరులో 56, కేసులు విశాఖలో 46, కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాజమండ్రిలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తిరుమల కాలేజ్ హాస్టల్ లో మూడు రోజుల పాటు జరిగిన కోవిడ్ పరీక్షల్లో 163 మంది కి పాజిటివ్ వచ్చింది.
వారిని కాలేజీ హాస్టల్ లోనే కంటోన్మెంట్ జోన్ ఏర్పాటు చేసి వైద్య చర్యలు చేపడుతున్నారు. వీటితోపాటు రాజమండ్రి, కాకినాడ, రామచంద్రపురం, ప్రాంతాల్లో 41 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎస్సీ పాఠశాలల్లో కరోనా వణికిస్తోంది. నాలుగో తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్ వచ్చింది. 353 విద్యార్థులు ఉన్న ఈ స్కూల్లో మరి కొంతమందికి కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించారు.
ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. గత పది రోజుల నుంచి జిల్లాలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 109 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి కేసులు పెరగడంతో చిన్నారులను స్కూల్స్ కి పంపేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
పుణ్యక్షేత్రం శ్రీశైలం లో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు మొత్తం 14 కేసులు రిజిస్టర్ అయ్యాయి. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత దేవస్థానం సిబ్బందికి కరోనా టెస్టులు చేయించారు. అందులో ఒక ముఖ్య అధికారి కి పాజిటివ్ రావడంతో దేవస్థానం అప్రమత్తం అయ్యింది.
వీరశైవ ఆగమ పాఠశాలల్లోని విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహించగా తొలుత ఈనెల 20న నలుగురు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. తర్వాత మరో ఐదుగురికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో మొత్తం తొమ్మిది మంది విద్యార్థులకు వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటికే చిత్తూరు, కృష్ణ, గుంటూరు, విశాఖ జిల్లాలు డేంజర్ జోన్ లోకి వెళ్ళాయి. మిగిలిన జిల్లాల్లోనూ కరోనా కేసులు పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు.