చిత్తూరు జిల్లాలో మొత్తం 74 మంది వాలంటీర్లు రాజీనామాకు సిద్ధమయ్యారు. జగనన్న కాలనీ లబ్ధిదారులు ఇల్లు కట్టుకునేలా చూడాలంటూ పంచాయతీ కార్యదర్శి తమను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషించారని వాలంటీర్లు ఆరోపించారు.

చిత్తూరు జిల్లా పాకాల పంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయన లేకపోవడంతో తహశీల్దార్ భాగ్యలక్ష్మిని కలిసి తమ రాజీనామాకు గల కారణాలను వివరించారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి ‘కుసుమకుమారి’ తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ మూకుమ్మడి గా రాజీనామా పత్రాలను తహశీల్దార్ భాగ్యలక్ష్మికి సమర్పించారు. కుసుమకుమారి కార్యదర్శిగా ఉన్నంత వరకు తాము విధులకు హాజరు కాబోమన్నారు.

తహశీల్దార్ భాగ్యలక్ష్మి ఈ రాజీనామా విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని వాలంటీర్లకు హామీ ఇచ్చారు. అయితే పంచాయతీ కార్యదర్శి మరో వాదన వినిపిస్తున్నారు. గత వారం పంటపల్లి గ్రామా సచివాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. వాలంటీర్లు విడిగా ప్రతిరోజు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని వారు ఆదేశించారు.

ఈ మేరకు ఎంపీడీవో అన్ని పంచాయతీ కార్యాలయాలకు ఉత్తర్వులు పంపారని, వాలంటీర్లు బయోమెట్రిక్ నమోదు చేయాల్సి వస్తుందని కారణంతోనే రాజీనామా చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. అయితే వాలంటీర్లు మాత్రం బయోమెట్రిక్ సమస్య కాదని స్పష్టం చేశారు. తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతున్న కుసుమ కుమారిని వెంటనే సస్పెండ్ చేయాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు.

x