నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు:
సైదాబాద్ కు చెందిన చిన్నారి అత్యాచారం.. హత్య కేసులో నిందితుడు రాజు కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఆరు రోజులు గడుస్తున్నా అతని ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో పోలీసులు 10 బృందాలగా ఏర్పడి నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. సమాచారం తెలిపిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు.
వినాయక చవితి నాడు సైదాబాద్ లో జరిగిన ఈ దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. నిందితుడు రాజు ఇంకా పరారీలోనే ఉన్నాడు. పోలీసులు ఇప్పటికే రాజు స్వగ్రామన్నీ జల్లెడ పట్టారు. రాజు భార్య, తల్లి, తండ్రి, అక్క, బావ తో పాటు స్నేహితులను సైదాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చి ప్రశ్నిస్తున్నారు. రాజు ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళేవాడు అని, ఎక్కువగా ఇసుక లారీల్లో పనిచేసేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో పోలీసులు ఇసుక లారీ అడ్డాల దగ్గర ఆరాతీస్తున్నారు.
చిన్నారిని హత్య చేసిన తర్వాత, రాజు ఏం చేశాడు?
గురువారం సాయంత్రం సింగరేణి కాలనీ లో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి చిప్స్ కొనిస్తానని నిందితుడు రాజు ఆశ చూపించి ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేశాడు. కానీ అది సాధ్యం కాకపోవడంతో మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేసి పారిపోయాడు. అర్ధరాత్రి రాజు ఇంట్లో చిన్నారి మృతదేహం లభించింది.
పాపను హత్య చేసిన తర్వాత, మరునాడు డాక్టర్ ఇంట్లో కూలి పని చేసిన రాజు వచ్చిన 11 వందల రూపాయలతో వైన్ షాప్ లో మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన డబ్బులతో ఎల్బినగర్ చేరుకొని ఉప్పల్ వైపు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. పారి పోయిన తర్వాత మొదటిసారి తల్లి కి ఫోన్ చేసిన రాజు తన భార్యకు డబ్బు పంపాలని తల్లిని కోరాడు.
నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ.. కుటుంబ సభ్యులు, స్థానికుల ఆందోళన
అప్పటివరకు కళ్ళముందు తిరిగిన చిన్నారి.. ఒక్కసారిగా శవమై కనిపించడంతో స్థానికులు ఆగ్రహానికి గురైయ్యారు. దీంతో నిందితుడు ఇంటిపై స్థానికులు దాడి చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగి లాఠీఛార్జ్ వరకు వెళ్ళండి. ఆ నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ కుటుంబ సభ్యులు, స్థానికులు సైదాబాద్ లో ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు భాదిత కుటుంబానికి మద్దతులు ప్రకటించాయి.
ఈ హత్య కేసులో పోలీసులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపితే 10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. నిందితుడు ఆచూకీ తెలిస్తే 9490616366, 9490616627 ఈ నంబర్లకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని ‘మంత్రి మల్లారెడ్డి’ సంచలన వ్యాఖ్యలు చేశారు. భాదిత కుటుంబాన్ని త్వరలోనే పరామర్శిస్తానని ఆయన తెలిపారు. ఓ నిందితుడు కోసం ఇంతా భారీ మొత్తంలో రివార్డు ప్రకటించడం ఇదే తొలిసారి.