ఆంధ్ర ప్రదేశ్ పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పింది. దీనిపై అపీల్ కు వెళ్లేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నం చేస్తుంది.
పోలింగ్ కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించలేదని మరల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఏడాదే ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇచ్చింది. అదే నెల 7న ఎన్నికలను నిర్వహించారు. పోలింగ్ కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించ లేదంటూ టిడిపి సభ్యుడు బండ్ల రామయ్య తో సహా జనసేన, బీజేపీ నేతలు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై మొదట విచారణ చేపట్టిన సింగల్ జడ్జ్, ఎన్నికలను వాయిదా వేయాలని ఆదేశించారు. సింగిల్ జడ్జి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని కచ్చితంగా నాలుగు వారాల పరిమితి లేదని ప్రభుత్వం తరుపున న్యాయవాది డివిజన్ బెంచ్ ముందు వాదనలను వినిపించారు.
ఇక ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్కు అనుమతించిన డివిజన్ బెంచ్ ఓట్ల లెక్కింపు చేయొద్దని ఆదేశించింది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఇరుపక్షాల తరుపున చాలా సార్లు హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో విచారణలు పూర్తిచేసిన ఉన్నత న్యాయస్థానం తాజాగా ఎన్నికలు రద్దుచేస్తూ తీర్పు వెలువరించింది.
కొత్తగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశించింది. అయితే పరిషత్ ఎన్నికల రద్దుపై ఎస్ ఈ సి సమాలోచనలు జరుపుతుంది. తీర్పుపై అప్పీల్ కు వెళ్లే అంశంపై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో వున్నారు నీలం సాహ్ని. కార్యాలయ అధికారులు హైకోర్టు తీర్పు వివరాలను ఎస్ ఈ సి కి వివరించారు. కోర్టు సూచనల మేరకే ఎన్నికల నిర్వహించామని చెబుతుంది ఎస్ ఈ సి. ఇదే అంశాన్ని ఆపిల్లో ప్రస్తావిస్తామని చెబుతుంది ఎస్ ఈ సి.