ఏపీ గల్లా పెట్టె పూర్తిగా ఖాళీ అయిపోయింది, ఒక్క రూపాయి కూడా లేదు దీనితో ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లించాలి అని ఆర్థిక శాఖ మంత్రి తలపట్టుకుంటున్నారు. చివరకు మిగిలింది రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పు తీసుకురావడమే. దీంతో ఉద్యోగులకు ఈ నెల జీతాలు చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరం ఆఖరిలో హడావిడిగా బిల్లుల చెల్లింపు, ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం పొందినప్పటికీ, పద్దులకు నిధులు కేటాయించడానికి డబ్బులు లేకపోవడంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి వచ్చింది.

నేడు సోమవారం మహావీర్ జయంతి బ్యాంకులకు సెలవు కావడంతో రేపు మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గరకు అప్పు కు వెళ్లాలని సర్కారు భావిస్తోంది. బుధవారం రిజర్వుబ్యాంకు బిల్లు పంపే అవకాశం ఉండటంతో ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు ఇలా మొత్తం సుమారు 13 లక్షల మంది కి బుధవారం నుంచి అరకొరగా జీతాలు అందనున్నాయి.

ఈనెల 5వ తేదీ వచ్చినప్పటికీ జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. ప్రతి నెల సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు మొదట జీతాలు ఇచ్చి, ఆ తర్వాత పదో తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. ఇక పెన్షనర్లకు 15వ తేదీ వరకు పెన్షన్ అందుతుంది. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో నిధులు లేకపోవడం చర్చనీయాంశమైంది. ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు మొత్తం కలిపి 13 లక్షల మంది ఉన్నారు.

వీరికి ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పెన్షనర్లకు 1200 కోట్లు, నాలుగు లక్షల మంది ఉద్యోగులకు 3,800 కోట్లు, మరో 1,000 కోట్ల రూపాయలు ఇతర వర్గాలకు కు జీతాలు చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ నెల ఉద్యోగుల జీతాల కోసం ఈ నెల 1 నుంచే ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. అయితే రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకొని ఒక నెల జీతాలు చెల్లిస్తుంది.

ఆర్థిక సంవత్సర ప్రారంభంలో వరుస సెలవులు రావడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అందలేదని, సర్దుబాటు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు, పైగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం పొందినప్పటికీ, RBI కి బిల్లులు వెళ్లలేదని వివరిస్తున్నారు. CFMF లో వచ్చిన టెక్నికల్ సమస్యల వల్ల జీతాలు ఆలస్యం కావడానికి కారణమని చెబుతున్నారు.

మంగళవారం ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్దకు అప్పు కోసం వెళ్లాల్సి ఉంది. రిజర్వ్ బ్యాంక్ అదేరోజు అప్పు మంజూరు చేస్తే బుధవారం జీతాలకు సంబంధించిన బిల్లులను RBI కి పంపిస్తే ఆ రోజు నుంచి జీతాల చెల్లింపు ప్రారంభమవుతుంది. అంటే ఈ నెల 7 నుంచి జీతాలు చెల్లింపులు ప్రారంభమవుతుంది. నిధుల సౌలభ్యం ఆధారంగా రెండు మూడు రోజుల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించకా, ఆ తర్వాత పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి.

రాష్ట్రంలో ఓట్ ఆన్ బడ్జెట్ కు మార్చి 28న గవర్నర్ ఆమోదముద్ర వేసినప్పటికీ కొంతమంది కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన సర్దుబాట్లు కారణంగా ఏప్రిల్ 1న జీతాలు చెలించలేక పోయారు. ఈ నెల 9న జగనన్న విద్యా కానుక పథకానికి కూడా నిధులు సర్దుబాటు చేయాల్సి ఉండటంతో, అసలు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో జగనన్న విద్యా కానుక పథకం వారం రోజుల పాటు వాయిదా వేశారని విశ్వసనీయ సమాచారం. ఈ నెల 15 వరకు జీతాలు, పెన్షన్ల చెల్లింపులే సరిపోతుంది. వీటన్నిటికి నిధుల సర్దుబాటు జరిగిన తర్వాతే మిగతా సంక్షేమ పథకాల అభివృద్ధి పై దృష్టి సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

x