హైదరాబాద్ లోని నిజాం పేట వద్ద రోడ్డు ప్రమాదంలో ఇటీవల గాయపడిన ఏ ఎస్ ఐ మహిపాల్ రెడ్డి చికిత్స పొందుతూ చనిపోయారు. మూడు రోజుల క్రితం నిజాంపేట రాఘవ రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరిగాయి. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకునేందుకు సృజన్ అనే యువకుడు ప్రయత్నించాడు. ట్రాఫిక్ పోలీస్ ను చూసి వేగంగా వెనక్కి వెళ్లి తన కారు తో మరొక కారును ఢీ కొట్టాడు.
మళ్ళీ ముందుకు వచ్చి అక్కడ ఉన్న హోంగార్డు ను ఢీ కొట్టాడు. హోమ్ గార్డ్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఇదే సమయంలో అతని పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి అక్కడికి వచ్చి కేసు వివరాలు నమోదు చేసుకుంటున్న సమయంలో వేగంగా వస్తున్న క్యాబ్ అతన్ని ఢీకొట్టింది. దీనితో తలకు బలమైన గాయం కావడంతో హాస్పిటల్ కి తరలించారు. మూడురోజుల ట్రీట్మెంట్ తర్వాత బ్రెయిన్ డెడ్ కావడంతో మహిపాల్ రెడ్డి చనిపోయారు.
దీనితో అవయవ దానం చేయాలని మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మరోవైపు మహిపాల్ రెడ్డి కుమారుడికి ఇటీవలే పెళ్లి ఖాయమైంది. త్వరలోనే వివాహం జరగనున్న వేళ ఆయన చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే పెట్రోలింగ్ మొబైల్లో స్పాట్ కు వచ్చారు మహిపాల్ రెడ్డి. ట్రాఫిక్ పోలీసులను విషయం అడిగి తెలుసుకుంటూ ఉండగానే ఎస్ఐ మహిపాల్ రెడ్డి ని అస్లాం అనే వ్యక్తి కారు తో ఢీ కొట్టాడు.
ఘటనలో మహిపాల్ రెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో కొండాపూర్ లోని కిమ్స్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. ఈ రెండు రోడ్డు ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు కిమ్స్ హాస్పిటల్ కి చేరుకొని ఎస్ఐ మహిపాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.