ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. కనీసం సంవత్సరానికి ఒక బయోపిక్ విడుదలవుతుంది. అయితే త్వరలో ఓ ఆసక్తికరమైన బయోపిక్ మనముందుకు రానుంది. అది మరెవరిదో కాదు.. దిగ్గజదర్శకుడు దాసరి నారాయణ రావుది.
దాసరి నారాయణ రావు గారి శిష్యుల్లో ఒకరైన ధవళ సత్యం ఆయన బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు మరియు ఇమేజ్ ఫిల్మ్ బ్యానర్ లో తాడివాక రమేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ బయోపిక్ అధిక సాంకేతిక విలువలతో మరియు భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి ‘దర్శక రత్న’ అనే పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ అధికారికంగా మేకర్స్ ప్రకటించలేదు.
దాసరి నారాయణ రావు గారి పాత్ర లో ఎవరు నటిస్తారు..? అనే విషయం మేకర్స్ ఇంకా ధృవీకరించలేదు. మూవీ మేకర్స్ ఈ పాత్ర కోసం టాప్ హీరోతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాలి.
1947 వ సంవత్సరంలో జన్మించిన దాసరి నారాయణ గారు 1972లో ‘తాతా మనవడు’ అనే చిత్రం తో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆయన 100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. ఆయన చివరిగా తీసిన సినిమా “ఎర్ర బస్సు” ఈ సినిమాలో ఆయన మంచు విష్ణుతో కలిసి నటించారు. ఆయన మే 2017 లో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.