కాకినాడ జీజీహెచ్ హాస్పటల్ రికార్డు సృష్టించింది. బ్లాక్ ఫంగస్ సోకిన 15 నెలల పసిబిడ్డకు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడింది. దేశంలోనే అతి చిన్న వయసు గల బాలుడికి బ్లాక్ ఫంగస్ శాస్త్ర చికిత్స చేసిన ఘనత జీజీహెచ్ కు దక్కింది. కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు పెరగటంతో జీజీహెచ్ లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే 152 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు ఉండగా, ఇంత వరకు 35 మందికి ఆపరేషన్లు చేసి కాపాడారు.
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు కు చెందిన 15 నెలల జానకి నందన్ కు బ్లాక్ ఫంగస్ సోకింది. దేశంలో అతి చిన్న పసిబిడ్డకు బ్లాక్ ఫంగస్ సోకిన కేసు ఇదే మొదటిది. మొదట బాబు తండ్రికి కరోనా సోకి తగ్గిపోయింది. తర్వాత బాబు ముఖం మీద బ్లాక్ ఫంగస్ వచ్చింది. స్థానిక డాక్టర్ల సూచన మేరకు బాబు ను కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ లో చేర్పించారు. ఈనెల 3వ తేదీన బాబు కు కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తీ చేశారు. ప్రస్తుతం బాబుకు బ్లాక్ ఫంగస్ తగ్గి ఆరోగ్యంగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు.