సోనూ సూద్ కు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించాలంటూ నటుడు బ్రహ్మాజీ కోరారు. కరోనా సమయంలో సోనూ సూద్ ఎంతో మంది ప్రజలకు సహాయం చేశారు. స్టార్ హీరోలే చేయలేని పనిని సోనూ సూద్ ఆస్తులు అమ్మి మరి సాయం చేస్తూ రియల్ హీరో గా పేరు తెచ్చుకున్నారు.
పంజాబ్ లోని మారుమూల ప్రాంతంలో పుట్టిన సోనూ సూద్ నటన మీద ఆసక్తితో ముంబై చేరుకున్నారు. కానీ ఆయనకు బాలీవుడ్లో అవకాశాల కంటే ముందే తమిళ, తెలుగు భాషల్లోనే అవకాశాలు దక్కాయి. సోనూ సూద్ గత కొంత కాలంగా ప్రజలకు అనేక విధాలుగా సహాయపడుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సినిమాలో విలన్ గా ఉన్న ఆయన ఇప్పుడు రియల్ హీరోగా మారిపోయారు.
ఇటీవలే పద్మ అవార్డులు కోసం కేంద్రం జనాల నుంచి స్పందన కోరింది. పద్మ అవార్డులకు ఎవరైనా అర్హులు ఉంటే పేర్లు చెప్పమని ప్రకటించడంతో టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ముందుకు వచ్చారు. సోనూసూద్ కి పద్మవిభూషన్ అవార్డు ఇవ్వవలసినదిగా కోరారు. సోనూ సూద్ కు ఈ అవార్డు ఇవ్వాలని కోరుకునేవారు రీట్వీట్ చేయండి అని సూచించారు.
దీంతో సోనూ సూద్ కు పద్మవిభూషణ్ ఇవ్వాలంటూ చాలా మంది కోరుకుంటున్నారు. దీనిపై సోనూ సూద్ స్పందించారు. “బ్రదర్ 135 కోట్ల మంది భారతీయుల ప్రేమను పొందటమే గొప్ప అవార్డు. ఇప్పటికే నేను ఆ అవార్డును పొందాను. మీరు నా పైన చూపించిన ప్రేమకు ధన్యవాదాలు” అంటూ రీట్వీట్ చేశారు సోనూసూద్.