హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం హైటెక్ సిటీ సమీపంలో రాత్రి 8గంటల 5 నిమిషాలకు జరిగినట్లు తెలుస్తుంది. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సాయి ధరమ్ పై ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. అయితే, సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన స్పోర్ట్స్ బైక్ గురించి చాలామంది ఆరా తీస్తున్నారు.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు బైక్లు అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఖరీదైన బైక్ల పై హైదరాబాద్ లో చక్కర్లు కొడుతూ ఉంటారు. 2020లో ఓసారి ఓవర్ స్పీడ్ కారణంగా పోలీసులు అతనికి ఫైన్ కూడా వేశారు. అయితే, ప్రస్తుతం ప్రమాదానికి గురైన బైక్‌ను సాయి ధరమ్ తేజ్ నాలుగు నెలల క్రితం కొనుగోలు చేశారు.
పోలీసులు నిన్న రాత్రి ప్రమాదం జరిగిన కొన్ని గంటల తరువాత ఆ బైక్‌ను రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. సాయి ధరమ్ తేజ్ 700 సిసి ఇంజిన్‌తో రూపొందించిన ట్రయంఫ్ ఆర్ఎస్ బైక్‌ను డ్రైవ్ చేస్తూ కనిపించాడు. కానీ, నటుడు ఆ బైక్‌ను ట్రిపుల్ ఇంజిన్‌తో 1,160 సీసీ కి అప్‌గ్రేడ్ చేశారు. ఈ బైక్ అనిల్ కుమార్ అనే పేరుతో రిజిస్టర్ అయ్యింది. ఆ బైక్ ఖరీదు అక్షరాల 18 లక్షలు.
ఈ స్పోర్ట్స్ బైక్ 189 కేజీల బరువును కలిగి ఉంది. ఈ బైక్‌ను లగ్జరీ బైకులకు పేరుగాంచిన ట్రయంప్ సంస్థ తయారుచేసింది. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 16 షోరూమ్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ట్రయంప్ కంపెనీకి చెందిన షోరూమ్ ను కొద్ది రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ స్వయంగా హైదరాబాద్ లో లాంచ్ చేశారు.
అప్పుడే సాయి ధరమ్ తేజ్ ఈ బైక్ పై మనసు పరేసుకున్నాడు. మొత్తానికి ఆ బైక్ను కొనుగోలు చేసి వాడుతున్నాడు. అప్పుడప్పుడు ఈ బైక్ పై హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కొడుతూ ఉండేవాడు. ఈ బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలోనే ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది.