RX100 మూవీతో పరిచయమై మొదటి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులను అలరించాడు మన యువ నటుడు కార్తికేయ, ఆ తర్వాత కూడా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపుతూ సత్తా చాటుతున్నాడు.
ఇలాంటి సమయంలో చావు కబురు చల్లగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తో కౌషిక్ పెగాళ్ళపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు ఈ సినిమాని నిర్మించాడు. యాక్టర్ ఆమని ఒక కీలక పాత్ర పోషించింది. మరియు హాట్ యాంకర్ అనసూయ ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసింది. జాక్స్ బిజోయ్ సంగీతమందించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, టైలర్, పాటలతో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం, ఆ అంచనాలను అందుకు ఉందా లేదా అని ఇప్పుడు మనం చూద్దాం.
చావు కబురు చల్లగా మూవీ కథ కథనం :
ముందుగా కథ విషయానికి వస్తే ఊరిలో చనిపోయిన వారందరికీ అంత్యక్రియలు జరిపించే వ్యక్తి బస్తీ బాలరాజు, మల్లికా మొగుడు అంత్యక్రియల్లో ఆమెను చూసి ఇష్టపడతాడు. వెంటనే ప్రపోజ్ చేస్తాడు. అయితే మల్లికా అతని ప్రేమను పట్టించుకోదు. కానీ బాలరాజు మాత్రం ఆమె వెంటపడుతూ ప్రేమించమని గొడవ చేస్తూ ఉంటాడు. దీనితో మల్లికా తనని వదిలించుకోవాలని అని చాల రకాలుగా ప్రయత్నిస్తుంది. ఇద్దరి రూట్లు వేరు అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ తరువాత పరిణామాలతో బాలరాజు ను ఇష్టపడుతుంది. అయితే ఇంతలో మల్లికా మామ ఆమెకు ఒక పెళ్లి సంబంధం తీసుకువస్తాడు. మరి ఆమె ఏమి చేస్తుంది, బాలరాజు ఆమె ప్రేమను గెలుచుకుంటాడా, వారిద్దరి మధ్య ప్రేమకు ఎలాంటి ముగింపు పలికిందని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కథా విశ్లేషణ:
ఫస్ట్ ఆఫ్ :
సినిమా విశ్లేషణకు వస్తే అంత్యక్రియలు నిర్వహించే స్మశానంలో కార్తికేయ ను పరిచయం చేసే సీన్ తో మూవీ మొదలవుతుంది. అంత్యక్రియల సమయంలోనే మల్లికా ప్రేమలో పడిపోవడం అక్కడే ప్రపోజ్ చేయడం కొత్తగా అనిపిస్తాయి. కార్తికేయ ప్రారంభ సన్నివేశాల్లో ఆయన నటన చాలా ఈజీ గా సాగింది. బాలరాజు ఎలాగైనా మల్లికాని పెళ్లి చేసుకోవాలని, మల్లికాను టీజింగ్ చేసే సన్నివేశాలు సరదాగా సాగుతూ ఆకట్టుకుంటాయి. బాలరాజు పాత్ర మంచి పంచ్ డైలాగులతో వినోదాన్ని పంచుతుంది. ఇక సరదాగా సాగిపోతున్న వన్ సైడ్ ప్రేమ కథని, ఇక మల్లికా అంగీకరించకపోవడం, ఆ తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయం బాలరాజు ఎమోషన్ అవ్వటంతో సినిమా మరో మలుపు తిరుగుతుంది. కొన్ని సన్నివేశాల్లో బాలరాజు పాత్ర పూరి జగన్నాథ్ సినిమాలోని హీరో పాత్రని తలపిస్తుందని చెప్పవచ్చు. ఎంత జరిగిన బాలరాజు తన ప్రయత్నాలను విడవకపోవడంతో, మల్లిక ఇద్దరి దారులు వేరు అనే చెప్పే ఎమోషనల్ సీన్ తో ఫస్ట్ ఆప్ ఆసక్తికరంగా ముగిస్తుంది.
సెకండ్ ఆఫ్:
ఇక ద్వితీయార్ధంలో అనసూయ సాంగ్ ఊపు తో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత తనలో వచ్చిన మార్పును చెబుతూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు బాలరాజు, బాలరాజు ప్రయత్నం ఫలించడం, లవర్స్ గా కాకుండా మనం ఫ్రెండ్స్ గా ఉండాలని మల్లికా చెప్పే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇంతలో మల్లికా మామ ఆమెకు ఒక సంబంధం తీసుకురావడం అతన్ని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడం మల్లికా ను సందిగ్ధంలో పడేస్తాయి. క్లైమాక్స్ కి వచ్చేసరికి సీన్ చాలా ఎమోషనల్ గా మారిపోవడం తో, ఒక గుడ్ ఫీల్ తో సినిమా ఎండ్ అయినట్లు అనిపిస్తుంది. అయితే ఒక తరహా సీన్లతో సినిమా అంతా సాగిపోవటం తో కొంచెం ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. మిగతా అంతా ఓకే.
ఇక నటీనటుల విషయానికి వస్తే ముందుగా బస్తి బాలరాజు గా నటించిన కార్తికేయ చెప్పుకుందాం అతని యాక్టింగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. చాలా సన్నివేశాల్లో సహజసిద్ధమైన నటనతో ఎంతో పరిణితితో నటించాడు. ఇక డి గ్లామర్ రోల్ లో నటించిన లావణ్య త్రిపాఠి తనలోని మరో యాంగిల్ ని అద్భుతంగా చూపించిండి అని చెప్పవచ్చు. ఇక మల్లికా మామగా మురళి శర్మ సహజసిద్ధంగా నటించారు. అలాగే గంగమ్మ గా ఆమని చాలా చక్కగా నటించారు. ఇక బాలరాజు స్నేహితుడిగా మహేష్ మెప్పించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, ప్రభు వంటివారు ఉన్నంతలో మెప్పించారు. ఇక మిగతా వాళ్ళు పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
సాంకేతిక విభాగం:
కౌషిక్ పెగాళ్ళపాటి డైరెక్టర్ గా తొలి చిత్రమే అయినా తాను అనుకున్న కథని తెరపై చూపించడంలో చాలా వరకు న్యాయం చేశాడు. స్మశానం లో ప్రేమించడం ఏమిటి అనిపించిన దానిని ఆమోదించే విధంగా కథను రాసుకున్నాడు.జాక్స్ బిజోయ్ సంగీతం ఆకట్టుకుంటుంది. కొన్ని పాటలతోపాటు నేపధ్య సంగీతంతో మెప్పిస్తుంది. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. ఇక మాటలు సినిమాకి ప్రాణం. మొత్తంగా చూస్తే సినిమా సరదాగా సాగే కూల్ ఎంటర్ టైనర్ అని చెప్పవచ్చు. కొత్త తరహా కథను మరింత కొత్తగా చెప్పే ప్రయత్నం చేసి ఉంటే ఇంకా బాగుండేది.