ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో దర్శన విధానాలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. కోవిడ్ ముందు దర్శన విధానాలు ఒక రకంగా ఉంటే, కోవిడ్ అనంతరం స్వామివారి దర్శనం లో అనేక మార్పులు వచ్చాయి. గతంలో తిరుమలకు చేరుకున్న భక్తులకు సర్వదర్శనం అందుబాటులో ఉండేది. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందలేకపోయిన సర్వదర్శనం క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకునేవారు.

ప్రస్తుతం కరోనా నిబంధనలు అనుసరించి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. గతంలో 60 వేల నుంచి లక్షమందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. కానీ, ప్రస్తుతం 20 వేల మంది మాత్రమే శ్రీవారిని దర్శించుకునేలా వెసులుబాటు కల్పించారు. టీటీడీ రోజుకి ఎనిమిది వేల టిక్కెట్లు చొప్పున ఆన్లైన్ లో విడుదల చేస్తుంటే నిమిషాల్లో టికెట్లు మాయమైపోతున్నాయి. మరోపక్క సేవా టికెట్లపై భక్తులను దర్శనానికి అనుమతిస్తున్న వాటి పరిస్థితి కూడా అలాగే ఉంది.

టికెట్లపై దర్శనం కావాలంటే రెండు నెలల పాటు ఆగాల్సి ఉంది. భక్తులకు ఉన్న మరో ఆప్షన్ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు పొందటం లేకపోతే సిఫార్సు లేఖల ద్వారా టికెట్లు పొందటం. శ్రీ వాణి ట్రస్ట్ కు రూ. 10,000 విరాళం అందించి వీఐపీ దర్శనం పొందే పరిస్థితి అందరికి ఉండదు. దీంతో ఇప్పుడు అందరి చూపు సిఫార్సు లేఖలపై ఉండి. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో అంతా కలిపి 20 వేల మంది దర్శించుకుంటున్నారు. ఇదే ఇప్పుడు భక్తులకు చిక్కులు తెచ్చిపెడుతుంది.

కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో స్వామివారిని దర్శించుకోవాలని భక్తుల్లో తపన రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో ఆన్లైన్లో టికెట్లు, సర్వదర్శనం లేకపోవడంతో అందరు సిఫార్సు లేఖల కోసం ప్రజా ప్రతినిధుల వెంటపడుతున్నారు. టీటీడీ పాలకమండలి కూడా లేకపోవడంతో ఒత్తిడి మొత్తం ప్రజా ప్రతినిధుల పైనే పడుతుంది. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రుల అపాయింట్మెంట్ దొరికిన సిఫార్సు లేఖలు మాత్రం దొరకటం లేదు. ఇప్పటికే మూడు నెలలకు సరిపడిన సిఫార్సు లేఖలను ప్రజా ప్రతినిధులు జారీ చేసేశారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టే వరకు ఈ పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదు.

x