ప్రస్తుతం అందరిన్ని భయపెడుతున్న విషయం కరోనా థర్డ్ వేవ్. ఈ కరోనా థర్డ్ వేవ్ భారిన పడకుండా విశాఖ జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలను చేపట్టింది. ప్రస్తుతం జనసంద్రంగా కనిపించే బీచ్ రోడ్డు ప్రాంతాలపై అధికారులు ఫోకస్ పెడుతున్నారు. శని, ఆదివారాల్లో బీచ్ రోడ్డులో ఆంక్షలు విధించాలని అధికారులు భావిస్తున్నారు.

విశాఖ వాసులకు ఏదైనా పర్యాటక ప్రాంతం ఉందంటే అది ఆర్కె బీచ్. ఈ బీచ్ నిత్యం వేలాది మంది పర్యాటకులు మరియు నగర వాసులతో కళకళలాడుతుంది. వీకెండ్స్ లో అయితే, సుమారు 10 వేల నుంచి 20 వేల మంది వరకు ఈ బీచ్ ని సందర్శిస్తారు. కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో మళ్లీ అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. బీచ్ దగ్గర మాస్కులు లేకుండా, దూరం పాటించకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు.

ఈ నిర్లక్ష్యం తో మహమ్మారి కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో కోవిడ్ నియంత్రణ చర్యలపై ఎప్పటికప్పుడు సమావేశమై యాక్షన్ ప్లాన్ లను సిద్ధం చేస్తున్నారు అధికారులు. వీకెండ్ లో బీచ్ కు వచ్చే జనసమూహంపై చర్చించిన అధికారులు పలు నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అయ్యారు.

శని, ఆదివారాల్లో సాయంత్రం ఐదున్నర గంటల తరువాత బీచ్ రోడ్ లోకి సందర్శకులను అనుమతించరాదని నిర్ణయించారు. దీనికి ఏపీ పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ నిర్ణయం మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. దీని గురించి రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తామన్నారు.

x