దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఓమిక్రన్ ప్రభావంతో గత కొన్ని వారాలుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు మూడు లక్షలకు పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3 లక్షల 47 వేల 254 కేసులు నమోదయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.
కర్ణాటకలో గడిచిన 24 గంటల్లో 45 వేల 754 కేసులు నమోదు కాగా, కేరళలో 46 వేల 387 కేసులు, మహారాష్ట్రలో 46 వేల 197 కేసులు, తమిళనాడులో 28 వేల 561 కేసులు, గుజరాత్ లో 24 వేల 485 కేసులు, ఏపీలో 12 వేల 615 కేసులు, ఢిల్లీ 12 వేల 306 కేసులు, తెలంగాణ 4 వేల 207 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
మహమ్మారి కరోనా ను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండటంతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం పలు ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. వైద్యం కోసం అమెరికా కి వెళ్ళిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్కడినుంచి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
వచ్చే రెండు ఆదివారాల్లోను పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 23, 30 తేదీల్లో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. రెండేళ్ల పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగుల తో పాటు క్యాన్సర్ ఉద్యోగులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లకి వర్క్ ఫ్రొం హోమ్ సదుపాయం కల్పించనున్నారు. మాల్స్, బీచ్ వంటి పర్యాటక ప్రదేశాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.