కరోనా కేవలం పట్టణాలలో ఉండే వారినే కాదు పచ్చని అడవుల్లో తలదాచుకునే మావోయిస్టులను కూడ వదిలి పెట్టడం లేదు. కరోనా సోకినా ఓ మావోయిస్టు నేత చికిత్స కోసం పట్టణానికి రావడంతో పోలీసులకు చిక్కాడు. అయితే మరో 12 మంది మావోయిస్టులు కరోనాతో భాదపడుతున్నారని పట్టుబడిన మావోయిస్టు చెప్పాడు.
కరోనా బారినపడి చికిత్స కోసం వరంగల్ నగరానికి వచ్చిన మావోయిస్టులు పోలీసులకు చిక్కారు. మావోయిస్టుల పార్టీ డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ అలియాస్ మోహన్ కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్నాడు. అలాగే, మావోయిస్టు పార్టీ కొరియర్ వినయ్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో వీరిద్దరూ చికిత్స కోసం వరంగల్ కు వచ్చారు.
ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు మధుకర్ ప్రయాణిస్తున్న వాహనం కనిపించింది. వాహనాన్ని పరిశీలించిన పోలీసులు వెనక భాగంలో అనుమానాస్పదంగా ఉన్న మధుకర్, కొరియర్ వినయ్ ను చూశారు. దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో మావోయిస్టులు అని తేలింది. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.
మావోయిస్టుల డివిజన్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ నివాసం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం లోని కొండపల్లి గ్రామం. 1999లో ఇతను పీపుల్స్ వార్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై మావోయిస్టుల దళంలో చేరాడు. ఇతను ఉమ్మడి ఆంధ్ర రాష్టం లో పలు విధ్వంసాలకు కూడా పాల్పడ్డాడు. అనంతరం పార్టీ ఆదేశాల మేరకు గడ్డం మధుకర్ 2000 వ సంవత్సరంలో దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కి బదిలీ అయ్యాడు.