ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. రోజువారి కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. ఈ రోజువారీ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, ఎలాంటి పరిస్థితి ఎదురైనా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్రం చెప్పుకొచ్చింది.

మన దేశంలో కొన్ని రోజులుగా లక్షకు పైగా నమోదవుతున్న కరోనా కేసులు ప్రస్తుతం రెండు లక్షలకు చేరువయ్యాయి. మరోవైపు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసుల సంఖ్య 5 వేలకు సమీపంలో ఉంది. మంగళవారం ఒక్కరోజే 400 పైగా కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.

మన దేశంలో గడచిన 24 గంటల్లో లక్ష 94 వేల 724 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివిటీ రేటు 11.05 శాతానికి చేరింది. ఓమిక్రాన్ కేసుల సంఖ్య 4 వేల 868 కి చేరింది. కేసుల పరంగా మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుంది. ఏపీ లో కొత్తగా 3 వేల 205 కరోనా కేసులు నమోదు కాగా, తెలంగాణలో 2 వేల 319 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు అన్ని రాష్ట్రాలు ఆంక్షల్ని కఠినతరం చేస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో కూడా కరోనా ఉద్ధృతి పెరగడంతో మకర సంక్రాంతి రోజు హరిద్వార్, రిషికేశ్ లో గంగానది ఘాట్ ల వద్ద పవిత్ర సానాన్ని నిషేధించారు.

దేశ రాజధాని ఢిల్లీలో పోలీస్ సిబ్బంది పై కరోనా పంజా విసురుతుంది. ఓమిక్రాన్ వ్యాప్తి తర్వాత వందల మంది పోలీసులు వైరస్ భారిన పడ్డారు. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు 1700 మందికి పైగా కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో దాదాపు 50 మంది సిబ్బందికి ఈ వైరస్ సోకిన ట్లు బుధవారం ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మహారాష్ట్ర లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఓమిక్రాన్ వ్యాప్తి తర్వాత ఆ రాష్ట్రంలోనూ వందల సంఖ్యలో పోలీసులకు వైరస్ సోకింది. ముంబైలో ఒక్కరోజే 120 మంది పోలీసులకు ఈ వైరస్ సోకింది. పోలీసు విభాగంలో ప్రస్తుతం ఆరువందలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

x