చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్, ఐసిఎమ్ఆర్ (ICMR) చర్యలను ముమ్మరం చేసింది. పిల్లల్లో క్లినికల్ పరీక్షల కోసం ఇప్పటికే డీజీసీఐ (DGCI ) అనుమతులు ఇచ్చింది.
ఢిల్లీ ఎయిమ్స్ లో ఇవాల్టి నుంచి చిన్నారులకు క్లినికల్ పరీక్షల చేయనున్నారు. మొత్తం 525 మంది చిన్నారులపై వ్యాక్సిన్ ప్రయోగాలు చేయనుంది భారత్ బయోటెక్ కంపెనీ. ఈ ప్రయోగాల కోసం చిన్నారులను మూడు గ్రూపులుగా విభజించింది. మొదటి గ్రూప్ లో 175 మంది చిన్నారులు ఉన్నారు. వీళ్లంతా 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు వాళ్ళు.
ఇక రెండవ గ్రూపులో 6 నుంచి 12 ఏళ్ల వయసు గల చిన్నారులు 175 మంది ఉన్నారు. మూడు గ్రూపులో 2 నుంచి 6 ఏళ్ల వయసు గల చిన్నారులు 175 మంది ఉన్నారు. మొత్తం 525 మంది చిన్నారులకు కొవాగ్జిన్ రెండు డోసుల టీకాలను ఇస్తారు. వీలైనంత త్వరగా ఈ ప్రయోగాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఢిల్లీ ఎయిమ్స్ తో పాటు పాట్నా ఎయిమ్స్ లోనూ క్లినికల్ పరీక్షలు ఇప్పటికే ప్రారంభించారు. అక్కడ 12 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటి వరకు భారత్ లో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ లేదు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే వ్యాక్సిన్ సేఫ్ అని తేలితే వెంటనే వాక్సినేషన్ ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది.