డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్ తో మేఘా ఆకాష్, అరుణ్ అదిత్‌, అర్జున్ సోమ‌యాజులు ప్రధాన పాత్రల్లో ఎ.సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ‘డియ‌ర్ మేఘ‌’. ఈ సినిమా క‌న్న‌డ‌ సూపర్ హిట్ చిత్రం ‘దియా’ కు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ ఎమోషనల్ ప్రేమ కథ చిత్రం ఈరోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

‘డియ‌ర్ మేఘ‌’ కథ:

ముందుగా కథ విషయానికి వస్తే స్వరూప్ కాలేజీలో అర్జున్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. కాకపోతే ఆమెది మూగ మనసులు నాటి ప్రేమ. దాంతో మేఘా స్వరూప్ తన ప్రేమను చెప్పలేక తనలో తానే మిక్కిలి మదనపడుతూ ఉంటుంది. దీంతో ఆమె సక్సెస్ ఫుల్ గా 40 నిమిషాల పాటు సినిమాను ముందుకు నడిపింది.

ఈ లోపు దర్శకుడు మూడేళ్లు ముగిశాయని ఒక చిన్న కార్డు వేసుకున్నాడు. మూడేళ్ల తర్వాత అర్జున్ మేఘ స్వరూప్ ముందుకు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. కాలేజీ రోజుల్లోనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతాడు. దాంతో ఇద్దరి పరిస్థితి ఒకటేనని అర్థమౌతుంది. చివరికి వారిద్దరూ ప్రేమించుకుంటారు. అంతలో ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంతో మేఘ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది.

ఆ పరిస్థితుల్లో మేఘ అనుకోకుండా ఆది (అరుణ్ అదిత్‌) అనే వ్యక్తిని కలుస్తుంది. మేఘ ఆది మధ్య స్నేహం మొదలవుతుంది. అతని స్నేహంలో మేఘ మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. ఈ లోపు వీరిద్దరూ ప్రేమలో పడతారు. ఇక ఈ ప్రేమ విజయవంతం అవుతుందని అనుకునే లోపు నేను ఇంకా ఉన్నాను అంటూ అర్జున్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడు. దాంతో మళ్ళీ మేఘ జీవితం మరో మలుపు తీసుకుంటుంది. చివరికి మేఘ ఆది కథ ఎలా ముగిసింది..? ఈ మధ్యలో అసలు ఏం జరిగింది..? అనేది మిగిలిన కథ.

సినిమా విశ్లేషణ:

ప్రధాన పాత్రలో నటించిన మేఘా ఆకాష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె అద్భుతంగా నటించింది. ఇక హీరో విషయానికి వస్తే, ఆది తన లుక్ మరియు ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా కనిపించాడు. సరదాగా తిరిగే ఒక కుర్రాడు పాత్రలో తను అద్భుతంగా నటించాడు.

ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ లో సాగే కొన్ని సరదా సన్నివేశాల్లోను మరియు సెకండాఫ్ లో హీరోయిన్ కి తన ప్రేమను తెలియజేసే సన్నివేశాల్లోను ఆది చాలా చక్కగా నటించాడు. తన తల్లి పవిత్ర లోకేష్ చనిపోయిన సీన్స్ లో కూడా అతను చాలా బాగా నటించాడు. అలాగే మరొక కీలక పాత్రలో అర్జున్ నటన పర్వాలేదనిపించింది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

దర్శకుడు ఎ.సుశాంత్ రెడ్డి ప్రేమకు సంబంధించి ఒక మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నాడు. కానీ, ఆ లైన్ ను పూర్తిస్థాయిలో ఆకట్టుకునే విధంగా కథ, కథనాలను రాసుకోలేదు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమ మరియు సంఘర్షణ తాలూకా సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకునే విధంగా లేవు. కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ స్లోగా సినిమాను మలిచారు.

సినిమా ప్లస్ పాయింట్స్: మేఘా ఆకాష్, ఆది (అరుణ్ అదిత్‌) నటన, కథ, నేపధ్య సంగీతం, కొన్ని ఎమోషనల్ సీన్స్, చివర్లో వచ్చే ట్విస్ట్.

సినిమా మైనస్ పాయింట్స్: రెగ్యులర్ ప్లే, రొటీన్ డ్రామా, హీరోయిన్ ఫస్ట్ లవ్ ట్రాక్, లాజిక్స్ మిస్ అవ్వడం, అన్నిటికి మించి స్లో నేరేషన్. మొత్తం మీద ఫీల్ గుడ్ లవ్ డ్రామా ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్: 2.25/5

x