నిన్న చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ పై మ్యాచ్ గెలిచింది. ఐపీల్ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రారంభంలో రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత బట్లర్, శివమ్ దూబే ఇద్దరు కూడా ఇన్నింగ్స్ ను దారిలో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే జడేజా వేసిన పదకొండవ ఓవర్లో ఊహించని అద్భుతం జరిగింది. ఆ ఓవర్ వేసిన జడేజా ఒకే ఓవర్లో బట్లర్ ను శివమ్ దూబే ను ఇద్దరిని ప్రేవిలియన్ కు పంపాడు. ఈ ఒక్క ఓవర్ తో రాజస్థాన్ వ్యూహాలు అన్ని తలకిందులయ్యాయి. దీంతో రాజస్థాన్ బ్యాట్స్మెన్స్ అందరు ప్రేవిలియన్ కు క్యూ కట్టారు. 11 నుంచి 15 ఓవర్ల మధ్య లో రాజస్థాన్ జట్టు 16 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా మోయిన్ అలీ దెబ్బకు రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయిందనే అనే చెప్పాలి.

మ్యాచ్ హైలెట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. చెన్నైలో ఎవరు చెప్పుకోతగ్గ పరుగులు చేయకపోయినా నెట్ రన్ రేట్ మాత్రం పడిపోకుండా జాగ్రత్త పడ్డారు. ఓపెనర్లు మొదలుకొని చివరి బ్యాట్స్మెన్ వరకు అందరూ ఎంతో కొంత పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఒక పక్క రాజస్థాన్ బౌలర్ల క్రమం తప్పకుండా వికెట్లు తీసుకుంటూనే ఉన్నారు. మరో పక్క వచ్చిన బ్యాట్స్మన్లు ఎవరు గ్రీజులో ఉంటే వారు బాగానే ఆడుతూ ఉన్నారు. మొదటి దిగిన డుప్లెసిస్ 17 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అంబటి రాయుడు 17 బంతుల్లో 27 పరుగులు చేయగా, మోయిన్ అలీ 20 బంతుల్లో 26 పరుగులు చేశారు. చివరిలో బ్రావో 8 బంతుల్లోనే 20 పరుగులు చేయడంతో చెన్నై జట్టు 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్స్ లో సకారియ మూడు వికెట్లు తీయగా, క్రిస్ మోరిస్ రెండు వికెట్లు, ముస్తాఫిజుర్ రహ్మాన్ మరియు రాహుల్ తివాటియా చెరొక వికెట్ తీశారు.

189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై బౌలర్ల దెబ్బకి కుప్పకూలింది. మొదట దిగిన బట్లర్ మినహాయిస్తే రాజస్థాన్ రాయల్స్ లో ఏ ఒక్కరూ చెప్పుకోతగ్గ స్కోర్ చేయలేదు. బట్లర్ 35 బంతుల్లో 49 పరుగులు చేసి, ఒకే ఒక్క పరుగు తేడాతో అర్థ సెంచరీ దూరం చేసుకున్నాడు. చివరిలో రాహుల్ తివాటియా, జై దేవ్ ఉనాద్కట్ అద్భుతంగా ఆడినప్పటికీ ఏమి ఉపయోగం లేకపోయింది. ఫలితంగా రాజస్థాన్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 143 పరుగుల వద్ద ఆగిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ లో మోయిన్ అలీ 3 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా 2 వికెట్లు, శ్యామ్ కరణ్ 2 వికెట్లు, బ్రావో మరియు శార్దూల్ ఠాకూర్ చెరొక వికెట్ తీసుకున్నారు.

x