దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డాగా మారాయి. కస్టమ్స్ అధికారుల తనిఖీలో ఎక్కడో ఒకచోట ఈ డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా శంషాబాద్, చెన్నై, ఢిల్లీ ఎయిర్ పోర్టులో పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుబడింది. దేశంలోకి మాదకద్రవ్యాలు ఎలా వస్తున్నాయి..? అసలు దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు..?
డ్రగ్స్ మాఫియా ఇతర దేశాల నుంచి డ్రగ్స్ ను అక్రమంగా భారత్లోకి రవాణా చేస్తుంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా, కస్టమ్స్ అధికారులు ఎంత నిఘా పెట్టిన డ్రగ్స్ మాఫియా మాత్రం అధికారుల కళ్ళు కప్పి దేశంలోకి డ్రగ్స్ ను తీసుకువస్తున్నారు. ఇటీవల ఈ డ్రగ్స్ రవాణా మరింత ఎక్కువైంది. తాజాగా శంషాబాద్, చెన్నై, ఢిల్లీ ఎయిర్ పోర్టులో 42 కిలోల హెరాయిన్ ను పట్టుకున్నారు. దీని విలువ ఏకంగా 277 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ :
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి 12 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకోగా, దీని విలువ బహిరంగ మార్కెట్లో 72 కోట్లు ఉంటుందని విచారణలో తేలింది. డి ఆర్ ఐ అధికారులు వారిద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జింబాబ్వే నుండి జోహాన్నెస్ బర్గ్ మీదగా వీరు హైదరాబాద్ కు వచ్చినట్లు దర్యాప్తులో తేలింది.
చెన్నై ఎయిర్ పోర్ట్ లో పట్టుబడిన డ్రగ్స్ :
ఇక చెన్నై ఎయిర్ పోర్ట్ లో కూడా 70 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడింది. జోహాన్నెస్ బర్గ్ నుండి వచ్చిన ఓ ఆఫ్రికన్ లేడీ డ్రగ్స్ తరలింపుకు పక్క ప్లాన్ వేసింది. చైర్ లో కూర్చుని మాదకద్రవ్యాలు రవాణా చేసే ప్రయత్నం చేసింది. ఈ కిలాడీ లేడీ పై అనుమానం వచ్చి తనిఖీలు చేయడంతో అసలు గుట్టు బయట పడింది. చెన్నైలో అరెస్ట్ అయిన మహిళలకు, హైదరాబాద్ లో అరెస్ట్ అయిన మహిళలకు లింక్స్ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడిన డ్రగ్స్ :
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కూడా భారీగా డ్రగ్స్ దొరకటం సంచలనం సృష్టిస్తోంది. దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఆఫ్రికన్ దేశస్థుల నుండి 137 కోట్ల విలువ చేసే 20 కేజీల హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాయిన్ ను షాంపూ, హెయిర్ కలర్ డబ్బాల్లో కలిపి తరలించే ప్రయత్నం చేశారు. ఈ మూడు కేసుల్లో అసలు సూత్రధారులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.