ఐరోపా దేశంలో వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల దెబ్బకు చిన్న చిన్న పట్టణాలే తుడిచి పెట్టుకుపోయాయి. జర్మనీ, బెల్జియంలో దాదాపు 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 1800 మంది గల్లంతయ్యారు.
పశ్చిమ ఐరోపాలో వరదల కారణంగా జర్మనీ, బెల్జియంలో గంటగంటకు మృతుల సంఖ్య పెరిగిపోతుంది. గల్లంతైన వందలాదిమంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నీటి ప్రవాహానికి ఇల్లు, కార్లు, ట్రక్కులు, జంతువులు అన్ని కాగితం పడవల్లా కొట్టుకుపోతున్నాయి. ఇందులో ఎన్నో మృతదేహాలు కూడా కొట్టుకుపోతున్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం వాహనాలను తొలగించేందుకు జర్మనీలో సైన్యం రంగంలోకి దిగింది. గత వారం మొత్తం ఏకధాటిగా కురిసిన వర్షాలు ఎట్టకేలకు శాంతించడం తో ఆదివారం నాటికి వరద నీరు కాస్త తగ్గింది. వర్షం ధాటికి విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో చాలా ప్రాంతాలు అంధకారంగా మారిపోయాయి. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఆహార పొట్లాల ను సరఫరా చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు కొట్టుకుపోవడంతో అందులో మృతదేహాలు పెద్ద సంఖ్యలో బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
నీటిలో పడిపోయిన విద్యుత్ లైన్లతో ప్రమాదం ఉందని ఎవరు అటు వైపు వెళ్ళద్దు అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణంపై అధికారులు చర్చిస్తున్నారు. జర్మనీ అధ్యక్షుడు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరద కారణంగా ఏర్పడిన చెత్తను తొలగించేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని ఆ తర్వాత ఎంత వరకు నష్టం జరిగిందో అంచనా వేయగలమని ఆయన చెప్పారు.