ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సు ఒక వలయంలా ఏర్పడింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. సుమారు ఈ వలయం గంట పాటు అందరిని కనువిందు చేసింది. ఆకాశం నిర్మలంగా ఉండడంతో చాలామంది ఈ వలయాన్ని చూడగలిగారు.
వాతావరణంలోని నీటి బిందువుల పై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందటం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడతాయి. సూర్యుని చుట్టూ మేఘాలు ఏర్పడినప్పుడు కూడా ఇలాంటి వలయం ఏర్పడుతోంది. ఈ వలయాకార ఇంద్రధనస్సు వ్యాసార్థం దాదాపు సూర్యుని చుట్టూ 22 డిగ్రీలు ఉంటుంది. శీతల దేశంలో ఈ వలయం తరచుగా ఏర్పడుతుంది. కానీ మన దగ్గర అరుదుగా ఏర్పడుతుంది.
గత ఏడాది ఆగస్టులో తమిళనాడులోని రామేశ్వరం లో ఇలాంటి వలయం కనిపించింది. అంతకు కొద్ది రోజుల ముందు జులై నెలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇలాంటి వలయం ఏర్పడింది. రామాలయం గోపురంపై సూర్యుడి చుట్టూ కనిపించిన వలయం అందరినీ అబ్బుర పరిచింది.