ఫీజుల దోపిడీకి బ్రేక్ వేస్తూ, ఏపీ ప్రభుత్వం తొలిసారిగా ప్రైవేట్ స్కూల్స్ మరియు జూనియర్ కాలేజీలకు ఫీజులను ఖరారు చేసింది. 2021 నుంచి 2024 వరకు ఈ ఫీజులు వర్తించబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో ఎవరికివారు అందినకాడికి దోచుకున్నారు. కానీ, ఇకపై ఇష్టారాజ్యంగా దోపిడి చేశారో ఇక అంతే..

ఫీజుల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం గత ఏడాదిలోనే ఫీజులపై నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ, న్యాయ వివాదంతో అది కాస్త అమలు కాలేదు. కానీ, వాటిని పరిష్కరించుకొని ఈ ఏడాది ప్రైవేట్ స్కూల్స్ కు, జూనియర్ కాలేజీలకు ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వానికి సిఫార్సులను అందించింది. దీంతో ప్రభుత్వం 53, 54 జీవో లను విడుదల చేస్తూ పంచాయతీ, మున్సిపాలిటీ మరియు నగరాల వారీగా ఫీజులను నిర్ణయించింది.

ప్రాంతాల వారీగా ప్రైమరీ స్కూల్స్ & సెకండరీ స్కూల్స్ ఫీజులు

1. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ కు 5,000 – 10,000 వేల వరకు మరియు సెకండరీ స్కూల్స్ కు 12,000 వేల వరకు ఫీజులు వసూలు చేయవచ్చు.

2. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ కు 11,000 వేల వరకు మరియు సెకండరీ స్కూల్స్ కు 15000 వేల వరకు ఫీజులు వసూలు చేయవచ్చు.

3. కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ కు 12,000 వేల వరకు మరియు సెకండరీ స్కూల్స్ కు 18,000 వేల వరకు ఫీజులు వసూలు చేయవచ్చు అని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రాంతాలు మరియు గ్రూపుల వారీగా జూనియర్ కాలేజ్ ఫీజులు

1. పంచాయతీ పరిధిలోని ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు 15,000 వేలు మరియు సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులకు 12,000 లుగా ప్రభుత్వం నిర్ణయించింది.

2. మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు 17,500 మరియు సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులకు 15,000 లుగా ప్రభుత్వం నిర్ణయించింది.

3. కార్పొరేషన్ పరిధిలోని ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు 20,000 వేలు మరియు సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులకు 18000 లుగా ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే స్కూల్స్ మరియు కాలేజీలోని హాస్టల్ ఫీజులను పంచాయతీ పరిధిలో 18,000 లుగా, మున్సిపాలిటీ పరిధిలో 20,000 లుగా, కార్పొరేషన్ పరిధిలో 24000 లుగా నిర్ణయించింది. ఇప్పటివరకు లక్షల్లో వసూలు చేసిన వారంతా ఇకపై ఈ లెక్కల ప్రకారమే వసూలు చేయాల్సి ఉంటుంది. యూనిఫార్మ్స్ ఐదేళ్ల వరకు మార్చకూడదు. పాఠశాలల్లో జేఈఈ, నీటి పేరితో అదనపు ఫీజులు వసూలు చేయకూడదు. కాలేజీలో అయితే 20,000 వరకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలి.

ఇక కోచింగ్ సెంటర్ల అనుమతికి, సంబంధిత విభాగాల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఫీజుల తో పాటు ఇతర రికార్డులను క్రమపద్ధతిలో ఉంచాల్సి ఉంది. విద్యార్థులను చేర్చడానికి వచ్చే తల్లిదండ్రులకు ఫీజులకు సంబంధించి పూర్తి సమాచారం అందించాలి. తమ వద్దే పుస్తకాలను కొనమని ఒత్తిడి చేయకూడదు. బోధన సిబ్బంది అర్హతలు మరియు వారికి చెల్లిస్తున్న వేతనాలు ఇతర ఖర్చుల రికార్డులను కమిషన్ వెబ్సైట్ లో పెట్టాలి.

ఫీజుల రూపంలో వసూలు చేసే మొత్తంలో 50 శాతం నిధులను సిబ్బంది జీతలకు, 15 శాతం సంస్థ నిర్వహణకు, 20 శాతం విద్యా సంస్థ అభివృద్ధికి కేటాయించాలని ఫీజుల నియంత్రణ కమిషన్ సూచించింది. ఈ ఫీజులు ఈ ఏడాది నుంచి మూడేళ్లపాటు అమలు కానున్నాయి.

x