గుంటూరు జిల్లా రాయవరం లో కాల్పుల ఘటన కలకలం రేపింది. పొలం వివాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు మరియు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మాచర్ల మండలం రాయవరం లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి రాయవరం గ్రామంలో పొలం వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గ్రామ పెద్దలు ఎంత చెప్పినా వినలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పరస్పరం కొట్టుకున్నారు. ఈ క్రమంలో మాజీ సైనికుడు మట్ట సాంబశివరావు తుపాకీతో ప్రత్యర్ధులపై కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో గ్రామానికి చెందిన మట్ట శివ, మట్ట బాలకృష్ణ మరియు ఆంజనేయుల తల ఇతర శరీర భాగాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. శివ, బాలకృష్ణ అక్కడికక్కడే మరణించగా, ఆంజనేయులు కు మాత్రం తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయి. అతడిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు సాంబశివరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో రాయవరం గ్రామం ఉలిక్కిపడింది. కాల్పుల్లో ఇద్దరు మరణించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇక మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాంబశివరావుకు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది..? దానికి లైసెన్స్ ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

x