పశ్చిమ బెంగాల్‌లో గౌహతి – బికనీర్ ఎక్స్ ప్రెస్ (15633) రైలు పట్టాలు తప్పింది. ప్రమాదం జరిగినప్పుడు రైలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ప్రమాదం సాయంత్రం 5 గంటల సమయంలో జరిగినట్లు భారతీయ రైల్వే సంస్థ తెల్పింది. ఈ ప్రమాదంలో 12 బోగీలు పట్టాలు తప్పాయి. వీటిలో ఎనిమిది బోగీలు ధ్వంసం కాగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు.

ఈ ఘటన పశ్చిమ బెంగాల్ జల్‌పైగురి జిల్లాలోని దొమోహనీ వద్ద జరిగింది. రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించినట్లు రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.

ఇక మరోవైపు భారతీయ రైల్వే సంస్థ ఈ ఘటనలో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం ప్రకటించింది. అలాగే, తీవ్ర గాయాలపాలైన వారికి లక్ష రూపాయలు.. స్వల్పంగా గాయపడిన వారికి 25 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలంలో సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. రైలు ప్రమాద దుర్ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కి ఫోన్ చేసిన ప్రధాని మోడీ ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

x