తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాగల 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఉత్తర, పశ్చిమ అల్పపీడనం ద్రోణి మరింత బల పడినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం నైరుతి దిశగా పయనిస్తూ క్రమంగా తెలంగాణ వైపు వస్తున్నట్లు అంచనా వేశారు.
దీని ప్రభావంతో రానున్న 2, 3 రోజుల్లో తెలంగాణలోని చాలా ప్రదేశాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.
సిరిసిల్ల జిల్లా రుద్రంగి లో 13.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. అల్పపీడనం నైరుతి రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో ఏపీ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ తీరాలపై అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది.