రెండు వారాలుగా మంటల్లో చిక్కుకున్న శ్రీలంక కార్గో షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఈ కార్గో షిప్ సముద్రంలో మునిగిపోవడం వల్ల పర్యావరణానికి మరియు సముద్ర జీవులకు ముప్పు తప్పదా?
శ్రీలంక పశ్చిమ తీరంలో మంటల్లో చిక్కుకున్న భారీ కార్గో షిప్ ఎట్టకేలకు సముద్రంలో మునిగిపోయింది. ఆ కార్గో షిప్ రెండు వారాలుగా మంటల్లో కాలుతూ సముద్రంలో కలిసిపోయింది. షిప్ మునిగిపోకుండా శ్రీలంక నౌకాదళం చేపట్టిన పనులు ఏమీ ఫలించలేదు. ఆ కార్గో షిప్ లో ఉన్న 25 మంది సిబ్బందిని రక్షించ గలిగారు.
శ్రీలంకలో జరిగిన అత్యంత గోర సముద్ర విపత్తులలో ఈ ప్రమాదం కూడా ఒకటని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మే 15న ఈ కార్గో నౌక గుజరాత్లోని హజీరా పోర్టు నుంచి కొలంబోకు బయలుదేరింది. ఇందులో దాదాపు 25 టన్నుల నైట్రిక్ యాసిడ్ మరియు 300 మెట్రిక్ టన్నుల ఇంధనం ఉంది. ఇప్పుడు ఈ కెమికల్స్ మరియు ఇంధనం సముద్రంలో కలవడంతో పర్యావరణానికి పెద్ద ముప్పుగా పరిగణించింది.
సముద్ర జీవుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది. దీంతో శ్రీలంక ప్రభుత్వంతో పాటు పర్యావరణ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేలుడు సంభవించి నైట్రిక్ యాసిడ్ తో పాటు ఇతర ఇంధనాల కు అంటుకోవడంతో షిప్ మూడు ముక్కలు అయినట్లు తెలుస్తుంది. షిప్పు లోని కెమికల్స్ నీటిలో కలవడంతో చేపల వేటను ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. ఈ ప్రమాదంతో మైక్రో ప్లాస్టిక్ కణాలు శ్రీలంక తీరప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. దీంతో వందలాది మంది నౌకాదళం సిబ్బంది దాన్ని తొలగిస్తున్నారు.