టాలీవుడ్ హీరోయిన్ ‘మెహ్రీన్ కౌర్ పిర్జాదా’ తన పెళ్లి జరగటం లేదని ప్రకటించింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు ‘భవ్య బిషోని’ తో ఇటీవల తన నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే, ఆ నిశ్చితార్థం పెళ్లి పీటల వరకు వెళ్ళకుండానే ఆగిపోయింది.
వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు ఓకే చెప్పడంతో ఆ ప్రేమ నిశ్చితార్థం వరకు చేరుకుంది. తర్వాత ఏం జరిగిందో కానీ, పెళ్లి జరగటం లేదని మెహ్రీన్ ట్వీట్ చేసింది. “ఇకపై తమ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండదని మెహ్రీన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో మనస్సు చెప్పినట్లు నిర్ణయం తీసుకున్నానని, ఈ విషయాన్ని తన బంధు మిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటారని” మెహ్రీన్ ట్వీట్ చేసింది. అయితే ఎందువల్ల ఈ వివాహం రద్దు చేసుకుంటున్నారో చెప్పలేదు.
ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మెహ్రీన్, భవ్య బిషోని మధ్య సినిమాల్లో నటించడం పైనే విభేదాలు తలెత్తినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ పెళ్లి కథ ముగిసిపోయిందని వార్తలు వస్తున్నాయి.
ఇటీవల మెహ్రీన్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, నిశ్చితార్థం చేసుకున్న తర్వాతే మెహ్రీన్ ఈ సినిమాకు సంతకం చేసింది. మెహ్రీన్ ఇంత సడన్గా ఈ సినిమాకు సంతకం చేయడంతో ఆమె పెళ్లి పై పలు అనుమానాలు తలెత్తాయి. అందరూ ఊహించిన దానికంటే భిన్నంగా మెహ్రీన్ తన మ్యారేజ్ క్యాన్సిల్ అయిందని ప్రకటించింది. దీంతో తన పెళ్లి ఆగిపోవడానికి సినిమాల్లో నటించడమే కారణమనే వార్తలు వస్తున్నాయి.