గూగుల్ సెర్చ్ ఫలితం లో జరిగిన ఒక విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారత్లోనే చెడ్డ భాష ఏమిటన్న ప్రశ్నకు కన్నడ అంటూ గూగుల్ సెర్చ్ తప్పుడు సమాచారాన్ని చూపిస్తుందని కన్నడ వాసులు వాపోయారు. దీంతో కన్నడ నెటిజన్లు గూగుల్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తమ కోపాన్ని సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా వెల్లడించారు. కన్నడ భాషకు 2,500 సంవత్సరాల చరిత్ర ఉందని, 6 కోట్ల మంది ప్రజలు ఈ భాషను మాట్లాడుతున్నారని, కన్నడ సాహిత్యంలో ఇప్పటివరకు 8 జ్ఞానపీఠ పురస్కారాలు వరించాయి అని గుర్తు చేస్తున్నారు. మరోవైపు పార్టీలకు అతీతంగా ఉన్న నాయకులు గూగుల్ పై విమర్శలు చేశారు. కన్నడ ప్రజలకు గూగుల్ క్షమాపణ చెప్పాలని, గూగుల్ లో దీనికి సంబంధించిన కంటెంట్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ విషయం పై స్పందించిన కన్నడ సంస్కృతి శాఖ మంత్రి
కన్నడ భాషను చెడ్డ భాష అంటూ వ్యవహరించిన గూగుల్ సంస్థ పై పోరాటం చేస్తామని కన్నడ సంస్కృతి శాఖ మంత్రి అరవింద్ లింబావళి అన్నారు. గూగుల్ అయినా ఇతర ఏ సంస్థలైన కన్నడ భాష పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియచేశారు. కన్నడ భాషకు ప్రాచీన భాష గా హోదా ఉందని ఆయన అన్నారు.
ఈ విషయం పై స్పందించిన మాజీ సీఎం
కన్నడ భాషకు జరుగుతున్న అవమానం పట్ల మాజీ సీఎం కుమారస్వామి గూగుల్ సంస్థ పై మండిపడ్డారు. కన్నడ భాష పట్ల ఇలా వ్యవహరించకూడదని, దీనికి సంబంధించిన కంటెంట్ ను వెంటనే తొలగించాలని లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియ చేశారు. భాష అనేది భావోద్వేగానికి సంబంధించిన విషయం అందుకే భాష ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. గూగుల్ క్షమాపణ చెప్పాల్సిందిగా కుమారస్వామి డిమాండ్ చేశారు.
కన్నడ ప్రజలను క్షమాపణ కోరిన గూగుల్ సంస్థ
— Google India (@GoogleIndia) June 3, 2021
ఈ విషయం పై కన్నడ ప్రజలకు గూగుల్ యాజమాన్యం క్షమాపణ చెప్పడం తప్ప లేదు. జరిగిన తప్పిదానికి, కన్నడ ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు గూగుల్ సంస్థ క్షమాపణ తెలియజేసింది. అదేసమయంలో, నిజానికి అభిప్రాయాలు గూగుల్ కి సంబంధం లేనివి అని వివరణ ఇచ్చింది.
సెర్చ్ రిజల్ట్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండవని, కొన్ని సార్లు కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలకు ఇంటర్నెట్లో ఆ కంటెంట్ వివరించబడిన విధానం.. ఆశ్చర్యకరమైన రీటిలో ఉంటుందని తెలియచేసింది. సెర్చ్ లో వచ్చినది సరైనది కాదని తమకు తెలుసని అందుకే సమస్య గురించి తెలియగానే దిద్దుబాటు చర్యలకు పూనుకుంటామని తెలిపింది. ఏదేమైనా జరిగిన అపార్థానికి, ప్రజల మనోభావాలు గాయపరిచినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది.