మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా నివాస ప్రాంతాల పై కొండ చరియలు విరిగిపడి 15 మంది మృతి చెందారు. ముంబైలోని ఈశాన్య ప్రాంతమైన చెంబురు లో ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా చెంబురులోని భరత్ నగర్ ప్రాంతంలోని ఇళ్ల పై కొండచరియలు విరిగి పడటంతో పై గోడలు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో ఇళ్లల్లో నివసిస్తున్న 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది శిధిలాల మధ్య చిక్కుకుపోయారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, ప్రకృతి వైపరీత్య నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వారు ఇంటి శిధిలాలను తొలిగిస్తు గాయపడినవారిని చెంబూరు లోని హాస్పటల్ కి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.