దేశం గర్వించదగిన గాయని.. భారతరత్న లతా మంగేష్కర్ తుది శ్వాస విడవడం తో అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. 92 సంవత్సరాల ‘లతా మంగేష్కర్’ ఇక లేరు అనే విషయాన్ని యావత్ భారతదేశం జీర్ణించుకోలేకపోతుంది. కోవిడ్ లక్షణాలతో జనవరి 11న హాస్పటల్ లో చేరిన గాన కోకిల గొంతు శాశ్వతంగా మూగబోయింది.

లతాజీ గొంతులో అమృతం ఉంది. ఆమె గానానికి ఎవరైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే.. లతామంగేష్కర్ 36 బాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు. లతా మంగేష్కర్ కెరియర్ మొత్తంలో 25 వేలకు పైగా పాటలు పాడిన తెలుగులో మాత్రం ముచ్చటగా మూడు పాటలే పాడారు. 1958 లో అక్కినేని సావిత్రి నటించిన ‘సంతానం’ చిత్రంతో ఆమె తెలుగుకు పరిచయం అయ్యారు.

ఆ తర్వాత 1965లో ఎన్టీఆర్ నటించిన ‘దొరికితే దొంగలు’ అనే సినిమాలో శ్రీ వేంకటేశ పాట పాడారు. 1988లో నాగార్జున శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ‘తెల్ల చీరకు’ అనే పాట సినిమాకు హైలెట్ గా నిలిచింది.

ఆమె భారతీయ సంగీతానికి అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్ తో పాటు అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ను కూడా అందజేశారు. వీటితో పాటు “దాదా సాహెబ్ ఫాల్కే” అవార్డు కూడా ఆమెను వరించింది. ఆమె ప్రస్తుతం మన దగ్గర లేకపోయినా ఆమె పంచిన స్వరం చిరకాలం వినిపిస్తూనే ఉంటుంది.

x