బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా శ్యాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన జూన్ 30 న ముంబైలోని హిందూజా హాస్పటల్ లో చేరారు. డాక్టర్లు ఆయనను ఐసియూ లో ఉంచి చికత్స అందించారు. కానీ, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈరోజు ఉదయం 07.30కి మరణించారు. ఆయన అంతకు ముందు జూన్ 6 న ఇదే సమస్యతో హాస్పటల్లో చేరినప్పటికీ ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు.

దిలీప్ కుమార్ అసలు పేరు “మహమ్మాద్ యూసుఫ్ ఖాన్”. ఆయన పాకిస్తాన్‌లోని పెషావర్‌లో 1922 డిసెంబరు 11న జన్మించారు. ఈయన అలనాటి ప్రఖ్యాత నటీమణి సైరా బానును వివాహమాడారు. ఆయనను తరచూ బాలీవుడ్ యొక్క “ది ఫస్ట్ ఖాన్” అని పిలిచేవారు. దిలీప్ కుమార్ ఉత్తమ నటుడిగా 8 ఫిల్మ్‌ ఫేర్ అవార్డులు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 1991 సంవత్సరం లో “పద్మభూషన్‌” అవార్డుతో ఆయనను సత్కరించింది. 1994 సంవత్సరం లో “దాదా సాహెబ్ ఫాల్కే” అవార్డు ఆయనను వరించింది.

ఆయన 1944లో వచ్చిన ‘జ్వార్ భాటా’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా అంతగా గుర్తింపు పొందలేదు. 1947 లో నిర్మించిన జుగ్ను సినిమాతో ఆయన మొదటి హిట్ అందుకున్నారు. ఆ తరువాత దీదార్ (1951), అమర్ (1954), దేవదాస్ (1955), ‘నయా దౌర్’ (1957), మధుమతి (1958), 1960 లో విడుదలైన ‘మొఘల్-ఎ-అజామ్’ సినిమా ఆయన జీవితంలో ఒక కీర్తి పతాకం. ఆయన చివరిగా ‘కిలా’ అనే సినిమాలో నటించారు.

x