రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణ లో వర్షాలు పడుతున్నాయి. అటువైపు ఏపీలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో ప్రస్తుత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజులపాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు తో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీనికి అల్పపీడనం తోడుకావడంతో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది.
ఈరోజు నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలోను మరియు ఆదివారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.