ఫేస్ బుక్ సీఈఓ “మార్క్ జూకర్‌బర్గ్”:
ఫేస్ బుక్ ఈ పేరు గురించి మనకు పరిచయం అవసరం లేదు. కుల, మత, భాష అనే బేధాలు లేకుండా అందరిని కలిపి ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసింది ఈ ఫేస్ బుక్. చైనా జనాభా 137 కోట్లు కానీ ఫేస్ బుక్ లో యూజర్ల సంఖ్య 139 కోట్లకు పైనే, అంటే ఫేస్ బుక్ ఒక దేశం అనుకుంటే జనాభా పరంగా ఇది చైనా కంటే పెద్దది అన్నమాట.
సరదాగా ఒక చిన్న వెబ్ సైట్ గా మొదలయ్యి ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్ వర్క్ సైట్ గా మారింది ఈ ఫేస్ బుక్. అటువంటి ఫేస్ బుక్ ని స్థాపించింది “మార్క్ జూకర్‌బర్గ్”. ఎంతోమంది బిసినెస్ లో తలలు పండిపోయి కొన్ని దశాబ్దాల నుంచి చేరుకోలేని స్థాయికి ఆయన చేరుకున్నాడు. ఆయన చిన్న వయసులోనే ప్రపంచం అత్యంత ధనవంతుల జాబితాలో ఎలా చేరాడు..? ఒక హాస్టల్ గదిలో ప్రారంభమైన చిన్న వెబ్ సైట్ ఇంతా పెద్ద స్థాయికి ఎలా చేరుకుంది..?
మార్క్ జూకర్‌బర్గ్ కుటుంబం వివరాలు:
Mark Zuckerberg Family
Mark Zuckerberg And Priscilla Chan
మార్క్ జూకర్‌బర్గ్ 1984వ సంవత్సరంలో మే 14వ తేదీన న్యూయార్క్ లో జన్మించారు. ఈయన తల్లి పేరు కరెన్. ఆమె ఒక ఒక మానసిక వైద్యురాలు. తండ్రి పేరు ఎడ్వర్డ్ జూకర్‌బర్గ్. ఆయన ఒక దంత వైద్యుడు. మార్క్ జూకర్‌బర్గ్ కి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. వారి పేర్లు రాండీ జూకర్‌బర్గ్, డోన జూకర్‌బర్గ్, అరిఎల్లె జూకర్‌బర్గ్. మార్క్ జూకర్‌బర్గ్ 2012 లో చైనాకు చెందిన ‘ప్రిస్సిల్లా చాన్’ అనే తన స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు ఆగష్టు జూకర్‌బర్గ్, మాక్సిమా చాన్ జూకర్‌బర్గ్.
“zucknet” సాఫ్ట్ వేర్ తో మొదలుపెట్టిన మార్క్ జూకర్‌బర్గ్:
“zucknet” software
చిన్నప్పటి నుంచి మార్క్ జూకెర్‌బర్గ్ కి కంప్యూటర్ పోగ్రామ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఆ విషయం గమనించిన తన తండ్రి తనకి వచ్చిన అథారి (Atari) అనే బేసిక్ ప్రోగ్రామ్ ని మార్క్ జూకెర్‌బర్గ్ కి నేర్పించారు. ఆ తర్వాత డేవిడ్ అనే ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ తో ప్రైవేట్ గా పాఠాలు కూడా చెప్పించాడు.
కానీ కొద్ది రోజుల్లోనే మార్క్ జూకెర్‌బర్గ్ అతని కన్నా వేగంగా ప్రోగ్రామ్ రాసే స్థాయికి వెళ్ళిపోయాడు. తనకు సమయం దొరికినప్పుడల్లా ప్రోగ్రామ్ మీద ఉండేవాడు. ఆ సమయంలో “జుక్ నెట్” (zucknet) అనే సాఫ్ట్ వేర్ ని తయారు చేశాడు. ఆ సాఫ్ట్ వేర్ మెసెంజర్ లాగా పనిచేసేది. ఆ సాఫ్ట్ వేర్ ని తన తండ్రి క్లినిక్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి క్లినిక్ కు సమాచారం చేరవేయడానికి ఉపయోగించేవాడు. అప్పటికి ఆయన వయసు కేవలం 12 సంవత్సరాలు. ఆ సమయంలో అందరు పిల్లలు కంప్యూటర్ గేమ్స్ ఆడుతూ ఉంటే, ఆయన మాత్రం కంప్యూటర్ గేమ్స్ ను తయారు చేసేవాడు.
“Synapse Media Player” యాప్ ను తయారు చేసిన మార్క్ జూకర్‌బర్గ్:
Synapse Media Playe
మార్క్ జూకర్‌బర్గ్ హైస్కూల్లో చదువుతున్నప్పుడు “సైనప్స్ మీడియా ప్లేయర్” (Synapse Media Player) ను తయారు చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది. స్లాష్‌డాట్ మరియు పిసి మ్యాగజైన్‌లు అద్భుతమైన సమీక్షతో 3/5 రేటింగ్ ను ఇచ్చారు. ఈ మీడియా ప్లేయర్ ను ఏవోఎల్ (AOL) మరియు మైక్రోసాఫ్ట్ (MICROSOFT) వంటి కంపెనీలు కొనాలని చూశాయి మరియు ఆయనకు ఉద్యోగం ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చాయి. కానీ దానికి ఆయన అంగీకరించలేదు.
“FACEMASH” వెబ్ సైట్ ద్వారా వచ్చిన Facebook ఐడియా:
FACEMASH
మార్క్ జూకర్‌బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు ”ఫేస్ మాస్” (facemash) అనే వెబ్ సైట్ ని క్రియేట్ చేశాడు. ఈ వెబ్ సైట్ లో హార్వర్డ్ యూనివర్సిటీ లో ఉన్న అమ్మాయిల ఫోటోలను పెట్టి వాళ్ళలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని పోలింగ్ ని పెట్టాడు.
ఈ వెబ్ సైట్ కి విపరీతమైన స్పందన వచ్చింది. ఒక్కసారిగా ఈ వెబ్ సైట్ గురించి యూనివర్సిటీ మొత్తానికి తెలిసింది. కానీ, ఇది అందానికి సంబంధించిన ఓటింగ్ కాబట్టి కొంత మంది అమ్మాయిలకు ఇది నచ్చలేదు. దీంతో ఆయన మీద కంప్లైంట్ చేశారు. అంతే కాదు, విద్యార్థుల అనుమతి లేకుండా వాళ్ళ ఫోటోలు వాడినందుకు ఆయనకు వార్నింగ్ ఇచ్చి ఆ వెబ్ సైట్ ను నిలిపివేశారు.
కానీ ఆ వెబ్ సైట్ వల్ల జూకర్‌బర్గ్ కు ఒక కొత్త ఐడియా వచ్చింది. కాలేజీలో ఉన్న వారెందరు తమకు సంబందించిన విషయాల గురించి, తమకు ఇష్టమైన ఫోటోలు, అభిరుచులు ఇలా అన్ని వివరాలు పొందు పరచుకొనేలా మరియు వాటిని తమ స్నేహితులతో పంచుకునేలా చేయాలనే ఆలోచన వచ్చింది. దానికి సంబంధించిన వెబ్ సైట్ ను తయారు చేయటానికి ఆయన చాలా కష్టపడ్డారు. తన ఫ్రెండ్స్ అందరూ పార్టీలకు వెళుతూ ఉంటే తాను మాత్రం హాస్టల్లో తెల్లవారులు కూర్చుని వెబ్ సైట్ ని క్రియేట్ చేశాడు. అలా తయారు చేసిందే “ది ఫేస్ బుక్” (the facebook)
TheFacebook పేరును Facebook గా మార్చిన జూకర్‌బర్గ్:
Thefacebook
మొదట్లో ఈ వెబ్ సైట్ ను కేవలం హార్వర్డ్ యూనివర్సిటీకి అనుకున్నాడు. కానీ, ఆ వెబ్ సైట్ కు వస్తున్న స్పందన చూసి దానిని అమెరికాలోని యూనివర్సిటీ విద్యార్థులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చాడు. ఈ వెబ్ సైట్ ని మరింత అభివృద్ధి చేయాలనుకున్నాడు. కానీ సమయం సరిపోక చదువు మధ్యలో ఆపేసి పూర్తిగా ఫేస్ బుక్ నిర్మించే పనిలో పడ్డాడు. అప్పుడే ‘ది ఫేస్ బుక్’ లో ఉన్న ‘ది’ ని తీసివేసి “ఫేస్ బుక్” గా మార్చాడు. అలా 2004వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన “ఫేస్ బుక్” అవతరించింది.
ఫేస్ బుక్ కు తగిలిన ఎదురు దెబ్బ:
Cameron, Tyler and Divya Narendra
ఫేస్ బుక్ ను కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చాడు. 2004 చివరి నాటికి పది లక్షల మంది ఫేస్ బుక్ లో చేరారు. అయితే కొద్దిరోజుల్లోనే ఫేస్ బుక్ కి ఎదురు దెబ్బ తగిలింది. కామెరాన్, టైలర్, దివ్య నరేంద్ర అనే ముగ్గురు ఫేస్ బుక్ తమ ఐడియా అని ఆయన తమ ఐడియాని కాపీ కొట్టారని కోర్టులో కేసు వేశారు. కేసు కొంత కాలం నడిచిన తరువాత ఆయన వారికి 45 మిలియన్ల డాలర్ల మరియు ఫేస్ బుక్ లో షేర్లను చెల్లించడంతో కేసు వివాదం ముగిసింది.
“ఇంస్టాగ్రామ్” ను కొనుగోలు చేసిన జూకర్‌బర్గ్:
Mark Zuckerberg bought instagram
మన ఫ్రెండ్స్ తో ఆన్లైన్లో చాట్ చేసుకోవడం అనేది ఆ రోజుల్లో అందరికీ తెగ నచ్చేసింది. దాంతో 2004వ సంవత్సరం తరువాత ఫేస్ బుక్ యూజర్ల సంఖ్య 50 లక్షలకు చేరుకుంది. ఫేస్బుక్ అభివృద్ధిని చూసి యాహు(YAHOO!) వంటి ఎన్నో కంపెనీలు ఫేస్ బుక్ ను కొనేయాలని చూశాయి. యాహు కంపెనీ అయితే సుమారు 900 మిలియన్ డాలర్లు ఇవ్వటానికి ముందుకు వచ్చింది. కానీ జూకెర్‌బర్గ్ మాత్రం అమ్మ లేదు.
జూకెర్‌బర్గ్ కు ముందు చూపు ఎక్కువ, అందుకే 2012లో ఇంస్టాగ్రామ్ ని వన్ బిలియన్ డాలర్లు చెల్లించి ఫేస్ బుక్ లో కలుపుకున్నాడు. ఇదే కాదు కనెక్ట్ యూ (connect u) ఫ్రెండ్ ఫీడ్ (friendfeed) ఛాయ్ లాబ్స్ (chailabs) వంటివి సుమారుగా 60కి పైగా కంపెనీలను సొంతం చేసుకున్నాడు. ఇలా సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతు ఫేస్ బుక్ స్థాపించిన పది సంవత్సరాలు గడిచే సరికి మల్టీ బిలినియర్ అయ్యాడు.
ఫేస్ బుక్ “బ్లూ కలర్” లో ఉండటానికి గలా కారణం:
మీరు గమనించారో లేదో ఫేస్ బుక్ ఎక్కువగా బ్లూ కలర్ లోనే ఉంటుంది ఎందుకో తెలుసా..? దీని వెనకాల ఏ సాంకేతిక కారణమో మరియు జూకర్‌బర్గ్ కు బ్లూ కలర్ అంటే ఇష్టమనే కారణాలేవి లేవు. ఆయనకు కలర్ బ్లైండ్ నెస్ ఉండి. దానివల్ల అతను ఎరుపు, ఆకుపచ్చ వంటి కలర్స్ ను సరిగ్గా చూడలేరు. ఆయనకు సంబంధించి బ్లూ కలర్ మాత్రమే రిచెస్ట్ కలర్. అందుకే ఫేస్ బుక్ ను బ్లూ కలర్ లో క్రియేట్ చేశాడు. అంతేకాదు, ఆయన ఇంటి గోడల రంగులు కూడా బ్లూ కలర్ లోనే ఉండేలా చూసుకుంటారు.
జూకర్‌బర్గ్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా:
The Social Network Movie
జూకర్‌బర్గ్ జీవితం ఆధారంగా “ది సోషల్ నెట్ వర్క్” అనే మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు ‘డేవిడ్ ఫించర్’ దర్శకత్వం వహించాడు. జూకర్‌బర్గ్ పాత్రను ‘జెస్సీ ఐసెన్‌బర్గ్’ (Jesse Eisenberg) పోషించాడు. ట్రెంట్ రెజ్నోర్ అట్టికస్ రాస్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. అంతేకాదు ఈ సినిమాకి మూడు ఆస్కార్ అవార్డులతో పాటు చాలా అవార్డులు కూడా వచ్చాయి.
“Person Of The Year” గా జూకర్‌బర్గ్:
person of the year
టైమ్స్ మ్యాగజైన్ 2010 మరియు 2013 లో జూకర్‌బర్గ్ ను “పర్సన్ ఆఫ్ ది ఇయర్” (person of the year)గా ప్రకటించింది. ఫోర్బ్స్ (Forbes) మ్యాగజైన్ ప్రకారం $ 71 బిలియన్ డాలర్లు అంటే 4 లక్షల 57 వేల కోట్ల రూపాయల ఆస్తితో జూకర్‌బర్గ్ ప్రపంచ ధనవంతుల జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. ఇంత ఆస్తి తో పాటు ఆయనకు మంచి మనసు కూడా ఉంది.
మార్క్ జూకర్‌బర్గ్ చేసిన మంచి పనులు:
internet.org
2013లో ఎబోలా వ్యాధి సోకి చాలామంది చనిపోతున్నప్పుడు వారికీ సహాయం చెయ్యడం కోసం ఆయన $ 25 మిల్లియన్ డాలర్స్ దానం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మందికి ఉచితంగా ఇంటర్నెట్ అందించాలనే ఉద్దేశంతో “internet.org” అనే సంస్థను స్థాపించారు. అలాగే బిల్ గేట్స్ మరియు వారన్ బఫెట్ లు కలిసి స్థాపించిన ఒక ఫౌండేషన్ కి తన ఆస్తిలో సగ భాగాన్ని విరాళంగా ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2015 డిసెంబర్ లో తనకు కూతురు పుట్టిన సందర్భంగా ఫేస్ బుక్ కంపెనీలో తనకు ఉన్న వాటాలో 99 శాతాన్ని తన “చాన్ జుకర్‌బర్గ్” అనే ఫౌండేషన్ కి రాసి ఇవ్వడం మరో ఎత్తు.
స్నేహితులు అందరూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు తాను ఒక్కడే కష్టపడుతునందుకు బాధ పడలేదు. ఫేస్బుక్ ని డెవలప్ చేయడం కోసం హార్వర్డ్ యూనివర్సిటీలో చదువు వదులుకోవడానికి ఆలోచించలేదు. ఎన్నో కంపెనీలు ఫేస్బుక్ ని కొనటానికి కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన డబ్బుకు ఆశపడ లేదు. తన మీద తన కంపెనీ మీద ఎన్నో కేసులు, వివాదాలు వచ్చినప్పటికీ భయపడలేదు. ఇవన్నీ దాటాడు కాబట్టే ఇప్పుడు ఆయన ఆ స్థాయికి చేరుకున్నాడు. ఇంత మందికి ఆదర్శంగా నిలిచాడు.