దేశంలో కరోనా పరిస్థితి రోజు రోజుకి విషమంగా మారుతుంది. గడిచిన 24 గంటల్లో 1,03,558 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే కరోనాతో ఈ రోజు మరో 478 మంది చనిపోయారు. కేవలం ఒకే ఒక్క రోజులో లక్షకుపైగా కరోనా కేసులు నమోదైన రెండో దేశంగా భారత్ మారింది. ఇంతవరకు అమెరికాలో మాత్రమే రోజు వారి కేసులు లక్ష దాటాయి. ఇప్పుడు అమెరికా తో పాటు మన దేశం కూడా చేరిపోయింది. దేశంలో ఇప్పటివరకు 1,25,00,000 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే 1,65,000 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 7,41,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. ఇంత వరకు 7 కోట్ల 91 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. దేశంలో ఆరు రోజులుగా 400 కు పైగా మరణాలు నమోదు కావడం అందర్నీ ఆందోళన కలిగిస్తుంది. కేవలం ఆరు రాష్ట్రాల్లోనే దేశంలో 90 శాతం కేసులు ఉన్నాయి. దీంతో కరోనా ను కట్టడి చేయడానికి రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశంలోని మొత్తం కరోనా యాక్టివ్ కేసుల్లో 60 శాతం, ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ తో పాటు వారం రోజుల పాటు లాక్డౌన్ విధించింది.
ఈ నెల ఆఖరి వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం కూడ కరోనా నిర్మూలనకు చర్యలు చేపట్టండి తమ రాష్ట్రంలో కి ఎవరైనా రావాలన్నా లేదా బయటకు వెళ్లాలన్నా RT-PCR పరీక్ష ను తప్పనిసరి చేసింది. దేశంలో 7 లక్షల 41వేల యాక్టివ్ కేసులు ఉంటే అందులో నాలుగు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఒక్క మహారాష్ట్రకు చెందినవి.
దేశంలో కరోనా వల్ల సంభవిస్తున్న మరణాలు కూడా సగం మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. మహారాష్ట్రలో రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముంబై, పూణే వంటి పట్టణాలలో వైరస్ ప్రభావం అధికంగా ఉంది. పూణే లో నిన్న 12,472 కేసులు నమోదు కాగా ముంబైలో 11,000 మంది కరోనా బారిన పడ్డారు. అయితే ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ రోజు వారి కేసులు 15000 కు మించలేదు. గత ఏడాది సెప్టెంబర్ 16వ తేదీన 97 వేల 894 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ఇంతవరకు ఇదే అత్యధికం.
ఆ తర్వాత వైరస్ ప్రభావం తగ్గుతూ వచ్చింది కానీ, సెకండ్ వేవ్ లో రోజు వారి కేసుల సంఖ్య లక్ష దాటడంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరోనాపై జనానికి భయం పోయిందని, నిబంధనలు పాటించక పోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో కరోనా అంశాలను కఠినంగా అమలు చేయవలసినదిగా రాష్ట్రాలకు సూచించింది మోడీ సర్కార్.
కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించండి కేంద్రం. దీంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిందిగా భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో కో వ్యాక్సిన్, కోవి షీల్డ్ వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు. దేశంలో వ్యాక్సిన్ కొరత లేకపోగా ఆశించిన స్థాయిలో జనం రాకపోవడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృధా అవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. దీంతో వ్యాక్సినేషన్ పక్రియను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.