దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. వరసగా మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలందరూ ఆందోళనకు చెందుతున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి కోవిడ్ బారిన పడ్డారు. మరోపక్క బడ్జెట్ సమావేశాల ముందు పార్లమెంట్ లో పనిచేసే 875 మందికి వైరస్ సోకింది.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గినప్పటికీ వరుసగా 4వ రోజు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 18 లక్షల 75 వేల 533 పరీక్షలు నిర్వహించగా, అందులో 3 లక్షల 33 వేల533 మందికి వైరస్ సోకినట్లు తేలింది. పాజిటివిటీ రేటు 17.22% నుంచి 17.78% శాతానికి పెరగడం టెన్షన్ పుట్టిస్తుంది. 525 మంది మహమ్మారి కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.
దీంతో రెండేళ్ల వ్యవధిలో 3.89 కోట్ల మందికి కరోనా వ్యాపించగా, 4 లక్షల 89 వేల 409 మంది మరణించారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 5.57% శాతానికి పెరగగా, రికవరీ రేటు 93.18% శాతానికి చేరింది. మహారాష్ట్రలో కొత్తగా 43,393 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 416 మందికి ఓమిక్రన్ వేరియంట్ సోకినట్లు చెబుతున్నారు. 48 మంది మృతి చెందారు.
కేరళ లో కొత్తగా 45,136 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో రోజువారి కేసుల సంఖ్య 30 వేల మార్క్ ను దాటింది. గడిచిన 24 గంటల్లో 30,744 కేసులు నమోదయ్యాయి. అటు దేశ రాజధానిలో కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 11,486 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు మాత్రం 21.48 శాతం నుంచి 16.36 శాతానికి పడిపోయింది.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం కరోనా బారిన పడ్డారు. ఆయనకు కోవిడ్ సోకడం ఇది రెండోసారి. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇంతలోనే భారీగా కరోనా కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తుంది. 2,847 మందికి పరీక్షలు నిర్వహిస్తే, అందులో 875 మందికి పాజిటివ్ అని తేలింది. రాజ్యసభ సెక్రటేరియట్ లో 915 మందికి టెస్టులు నిర్వహించగా, 271 మందికి వైరస్ సోకింది.