గడిచిన 24 గంటల్లో భారతదేశం లో 86,498 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 63 రోజుల తర్వాత రోజువారీ కేసులు లక్ష కన్నా తక్కువ రావడం ఇదే మొదటిసారి. భారతదేశం లో ఏప్రిల్ 5న చివరిగా లక్ష కేసుల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. సరిగ్గా ఒక నెల తరువాత అనగా, మే 6 న, భారతదేశం లో అత్యధికంగా 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.
రోజువారీ కరోనా మరణాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 2,123 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 3,51,309కి చేరింది.
రోజువారీ కేసులు మహారాష్ట్ర లో అత్యధికంగా నమోదవుతున్నాయి. సోమవారం రాష్ట్రంలో 10,219 కొత్త కరోనా నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఏపీలో కొత్తగా 4,872 కేసులు నమోదు కాగా, తెలంగాణలో 1,933 కేసులు నమోదయ్యాయి.
భారతదేశంలో ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 13,03,702 వద్ద ఉంది. గడిచిన 24 గంటల్లో 1,82,282 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారతదేశం లో టీకా డ్రైవ్ నెమ్మదిగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 23,61,98,726 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.