ఒక దారుణమైన సంఘటన ప్రపంచ మహిళా దినోత్సవం రోజునే వెలుగు చూసింది. ఒక ఆడ శిశువును చెత్తకుండీలో పడేశారు. ఈ సంఘటన డోర్నకల్ మండలం, బుర్గుపహాద్ గ్రామములో జరిగింది. అప్పుడే పుట్టిన ఒక ఆడ శిశువును గోను సంచిలో కట్టి చెత్తకుండీలో పడివేశారు.
వ్యవసాయ పనికి వెళ్తున్న కూలీలకు ఒక శిశువు ఏడుపు వినిపించింది, దానితో ఆ ఏడుపు ఎక్కడ నుంచి వస్తుందని వెతికారు. తీరా చుస్తే ఆ ఏడుపు పక్కనున్న చెత్తకుండీలో నుంచి వస్తుందని గమనించి చూడగా, ఒక ఆడ శిశువు గోను సంచిలో ఉండటం చూశారు. అది చుసిన వ్యవసాయ కూలీలు గోను సంచిని బయటకు తీశారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు శిశువును ఆ ఏరియాలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. ఈ సంఘటన మహిళా దినోత్సవం నాడే జరగడంతో అక్కడ గ్రామస్తులు కంట తడి పెట్టుకున్నారు. ఒక ఆడ పిల్లగా పుట్టడమే పాపమా అంటూ ఆ గ్రామస్తులు ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటనకు పాల్పడిన తల్లితండ్రులను అసలు వదిలి పెట్టద్దు అని, మరో ఆడ శిశువుకు ఇలా జరగకుండా కఠినంగా శిక్షించాలి అని గ్రామస్తులు డిమాండ్ చేసారు. మరో వైపు హాస్పిటల్ కు తరలించిన శిశువు పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెబుతున్నారు.