పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మలయాళంలో ఘన విజయం సాధించిన “అయ్యప్పనుమ్ కోషియం” మూవీ రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ ను జూలై 26న మొదలుపెట్టారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఈ షూటింగ్లో పవన్ కళ్యాణ్, రానా పై కొన్ని పోరాట సన్నివేశాలను దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్ కు హాజరైనట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కి రిలీజ్ చేయాలని నిర్మాత సూర్యదేవర నాగ వంశీ భావిస్తున్నారు.

ఈ చిత్రానికి ఇప్పటి వరకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించారు. అయితే, డేట్స్ సమస్య కారణంగా ప్రస్తుతం ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక ఆయన స్థానంలో రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది.

నిర్మాత నాగ వంశీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేత ఒక పాటను పాడించేందుకు ప్రయత్నిస్తున్నాడు. జానపద బాణీతో సాగే ఈ పాటను పవర్ స్టార్ త్వరలోనే పడుతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ చేత ‘కొడకా.. కోటేశ్వరరావు..’ అనే పాటను పాడించారు.

ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు, అలాగే పవన్ కళ్యాణ్ చేత ఒక పాటను పాడించాలని నిర్మాత భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో విడుదల కానున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ లో 12వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు.

x