కరోనా తో వణికిపోతున్న జనానికి పెట్రోల్ రేట్లు మరింత వణుకు పుట్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. రోజువారీ ఖర్చులకు తోడు పెరిగిన ధరలు సామాన్యులకు ఊపిరాడనివ్వడం లేదు.
దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. మే నెలలోనే దేశంలో పెట్రోల్ ధరలు చాలా ఎక్కువగా పెరిగాయి. ఒక్క మే నెలలోనే చమురు కంపెనీలు 15 సార్లు పెట్రోల్ రేట్లు పెంచాయి. మే తర్వాత కొన్ని రోజులు పెట్రోల్ మరియు డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
అయితే, ఇటీవల మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. రోజుకి పెంచేది 10 పైసలు 20 పైసలైన వరుసగా పెరుగుతూ ఉండటంతో వాహనదారుల పై భారం పడుతుంది. ఇప్పటికే రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ లీటర్ పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు గా ఉంది.
ముంబైలో అయితే లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలకు పైన ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 93 రూపాయలు కాగా, డీజిల్ ధర 84 రూపాయలు గా ఉంది. వరుసగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు వాహనం బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు.