ప్రజలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలన చేసే దిశగా మరో అడుగు పడింది. సాధారణ ప్రజానికానికి కరోనా టీకా ఇచ్చే రెండో దశ కార్యక్రమం, సోమవారం దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది.

ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి ప్రముఖులు పాల్గొనే సెకండ్ ఫేస్ వాక్సిన్ కి శ్రీకారం చుట్టారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా టీకా వేయించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.

Venkaiah Naidu has taken Covid Vaccine

ఇక రెండో దశ వాక్సినేషన్ కార్యక్రమంలో 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న 45 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్కులకు కరోనా టీకా ఇస్తున్నారు.

ఉదయం 9 గంటలకు కోవిడ్ పోర్టల్ ప్రారంభించిన తరువాత, దానిలో రిజిస్ట్రేషన్ కి ప్రజలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం 4 గంటల్లోనే దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా రిజిస్టర్ చేసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది.

ఆ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్లకు వేలాదిమంది క్యూ కట్టారు. ఈ క్రమంలో అందరికంటే ముందుగానే ఉదయం 6 గంటలకే ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో టీకా వేయించుకున్నారు. టీకా వేసుకోవడానికి చాలా మంది భయపడటం, ఇంకా ట్రైల్స్ లోనే ఉండగానే ఆమోదం తెలిపారంటు, భారత్ బయోటిక్ టీకాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో, పూర్తి స్వదేశీ టీకా అయినా కోవాక్సిన్ ను ప్రధాని తీసుకున్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెన్నైలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో టీకా తొలి డోస్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అర్హులంతా విధిగా టీకా వేయించుకోవాలని, వైరస్ వ్యతిరేఖ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అటు ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్లో కేంద్రం హోమ్ మంత్రి అమిత్ షా టీకా తీసుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు కూడా టీకా తీసుకున్నారు.

సుప్రీమ్ కోర్టులోని జడ్జిలు, వారి కుటుంబాలకు ఇవాల్టి నుంచి కోవిడ్ టీకా ఇవ్వనున్నారు. కోవాక్సిన్, కోవిడ్ షీల్డు ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశాన్ని వారికిచ్చారు. దీనితో సుప్రీమ్ కోర్ట్, రిజిస్ట్రీ వాక్సినేషన్ కు సంబంధించి ఏర్పాట్లు చేసారు.

ఇక డబ్బులు చెల్లించి తమ నియోజకవర్గాల్లోని టీకా తీసుకోవాలని తద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు బీజేపీ నిర్ధేశించింది. ఇలా ఉంటే, వాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రూపొందించిన కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవడం ఇబ్బందిగా మారింది.

సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని, ఫిర్యాదులు రావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఒక్కసారిగా ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం ఎగబడటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి అని అన్నారు. ఈ నేపథ్యంలో టీకా రిజిస్ట్రేషన్ ను పోర్తల్లో చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది.

x