పాకిస్తాన్ లో చిక్కుకున్న తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు తన స్వస్థలం విశాఖ కు చేరుకున్నాడు. పోలీసులు ప్రశాంత్ ను నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారు. 2017లో పాకిస్తాన్ బోర్డర్ లో ప్రశాంత్ చిక్కుకున్నాడు. అయితే ఎట్టకేలకు ప్రశాంత్ పాకిస్తాన్ చెర నుంచి విడుదలై విశాఖకు చేరడంతో వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రశాంత్ మాదాపూర్ లో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసేవాడు. అయితే 4 సంవత్సరాల క్రితం ప్రశాంత్ కుటుంబ సభ్యులు వద్దని వారిస్తున్నా వినకుండా స్విట్జర్లాండ్‌లో ఉన్న తన ప్రేయసిని కలుసుకునేందుకు బయలుదేరాడు. తరువాత పాకిస్తాన్‌ సరిహద్దులో ఉన్న కంచె దాటినందుకు ప్రశాంత్‌ను పాకిస్తాన్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది.

అప్పటి నుంచి పాక్ చెర లోనే ఉన్న ప్రశాంత్ ను ప్రస్తుతం పాక్ అధికారులు భారత్ కు అప్పగించారు. 2017 లో తమ కుమారుడిని రప్పించే ప్రయత్నం చేయాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ను ప్రశాంత్ తండ్రి బాబు రావు విజ్ఞప్తి చేశారు. అప్పటి నుంచి అతని రాకకోసం ఎదురు చూస్తూ ఉండగా నేడు విశాఖకు చేరుకోవడంతో స్థానికంగా సంబరాలు చేసుకుంటున్నారు.

తమ కొడుకు ఇండియా కు తిరిగి రావడానికి ప్రభుత్వాలు ఎంతో సాయం చేశాయని ప్రశాంత్ తండ్రి బాబురావు అన్నారు. రెండు రాష్ట్రాలతో పాటు సహాయక సంస్థలు కూడా ప్రశాంత్ విడుదలకు ఎంతో కృషి చేశాయని ఆయన తెలిపారు. తాను మళ్లీ తల్లితండ్రులను కలుస్తానని అసలు అనుకోలేదని ప్రశాంత్ చెప్పారు. భారత ప్రభుత్వం సాయంతోనే ఇంత త్వరగా ఇంటికి చేరుకున్నానని, పాకిస్తాన్ లో చిక్కుకున్న మిగతా వారిని కూడా భారత్ కు తీసుకురావాలని ప్రశాంత్ విజ్ఞప్తి చేశాడు.

x