కర్నూలు జిల్లా వాసులు దశాబ్దాల కల నెరవేరబోతోంది. రెండున్నర సంవత్సరాల క్రితం లాంఛనంగా ప్రారంభించిన కర్నూల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు ఎగరబోతున్నాయి. ఈనెల 28 నుంచి రాకపోకలు ప్రారంభం కానున్నాయి. నేడు ఈ విమానాశ్రయాన్ని సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
కర్నూలు ఎయిర్పోర్ట్ దశాబ్దాల కల ఆవిష్కృతం కాబోతుంది, రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు కు ఎయిర్ పోర్ట్ మంజూరు అయింది. 2018లో అప్పటి సీఎం నారా చంద్రబాబునాయుడు గారు ఈ ఎయిర్ పోర్ట్ కి శంకుస్థాపన చేశారు. విమానాశ్రయానికి పది కిలోమీటర్ల ప్రహరీ గోడ, 2.2 కిలోమీటర్ల పొడవునా రన్ వే, ప్యాసింజర్ టెర్మినల్ పూర్తయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనం, ఏ టి సి టవర్ వంటి నిర్మాణాలు ఇంకా పూర్తి కావల్సి ఉంది.
2019 ఎన్నికల్లో వైసిపి అధికారం చేపట్టాక విమానాశ్రయం మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అదనంగా 75 కోట్ల నిధులు మంజూరు చేసింది. పనులు పూర్తిచేసి ఈ విమానాలను నడిపేందుకు కావాల్సిన అన్ని అనుమతులు పొందింది. కర్నూలుకు 22 కిలోమీటర్ల దూరంలో ఓర్వకల్ వద్ద ఎయిర్ పోర్ట్ ను నిర్మించారు. ఆకర్షణీయంగా ఉన్న రాతిశిలల మధ్య ఎయిర్ పోర్ట్ సిద్ధమైంది.
కర్నూలు జిల్లా వాసులు విమాన ప్రయాణం చేయాలంటే హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఈ విమానాశ్రయం జాతీయ రహదారి 44 కి 22 కిలోమీటర్ల దూరంలో, ఎన్.హెచ్ 40 కి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రస్తుత విమానాశ్రయం ఏర్పాటు చేశారు. ఈ విమానాశ్రయాని 1008 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 175 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు. ఎయిర్ పోర్ట్ కి కేటాయించిన ప్రాంతమంతా కొండ ప్రాంతం అక్కడ త్వరగా ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామంటే ఎవరు నమ్మలేదు,
అయితే రాత్రింబవళ్లు యంత్రాలతో పనిచేసి కొండలను పిండి చేసి నిర్మాణం పూర్తి చేశారు. ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేసుకొని విమానాల రాకపోకలకు ట్రయిల్ రన్ కూడా నిర్వహించారు. ప్రముఖుల ప్రవేట్ విమానాలు కూడా తరచు వచ్చి వెళుతున్నాయి. కడప ట్రాఫిక్ కంట్రోల్ నుంచి విమాన రాకపోకలకు సాంకేతికంగా అనుసంధానం చేసింది. ఇప్పటి వరకు 38 విమానాల రాకపోకలు సాగించాయి. కర్నూల్ ఎయిర్పోర్ట్ లో ఒకేసారి నాలుగు విమానాలు పార్కింగ్ చేసేలా ఈ విమానాశ్రయం ఏర్పాటు చేశారు.