Sreekaram Movie Review, Rating
యువ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్. విభిన్న కథలను ఎంచుకుంటూ తన సినిమాలపై పాజిటివ్ బజ్ ఏర్పరుచుకున్నాడు. అలాగే కుటుంబ సమేతంగా రెండు గంటల పాటు హాయిగా చూడదగిన సినిమాలను అందిస్తున్న ఈ తరం హీరోలలో శర్వానంద్ ముందు వరసలో ఉంటారని చెప్పొచ్చు.
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, శతమానంభవతి, మహానుభావుడు, పడిపడిలేచే మనసు, జాను ఇలా ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు అయినా హీరోగా వచ్చిన మరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ” శ్రీకారం ”. ఆధునిక వ్యవసాయం, యువత వ్యవసాయం లోకి రావడం వంటి బాధ్యతాయుతమైన సబ్జెక్టుతో శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ద్వారా కిషోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. శర్వానంద్ కి జోడిగా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించారు. మహాశివరాత్రి కానుకగా మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా విడుదలై ఎలాంటి ఫలితాన్ని అందుకుందని రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
Sreekaram Movie Story Analysis
ముందుగా కథ విషయానికి వస్తే అనంతరాజపురానికి చెందిన రైతు కేశవుల కొడుకు కార్తీక్ మంచి జీతానికి సిటీ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే ఏకాంబరం అనంతరాజపురానికి చెందిన రైతులకు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ, వారు తిరిగి కట్టలేని క్రమంలో ఆ రైతుల భూములను తన పేరు మీద ఏర్పరుచుకుంటూ ఉంటాడు.
ఈ క్రమంలోనే కార్తీక్ తండ్రి కేశవులు కూడా ఏకాంబరం వద్ద బాకీ తీసుకోవడంతో అతడి పొలాన్ని తనకు రాయాల్సిందిగా ఏకాంబరం ఒత్తిడి చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కార్తీక్ సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన ఊరికి వస్తాడు. అక్కడ తన తండ్రి బాకీ తీర్చేందుకు కార్తీక్ వ్యవసాయం చేస్తాడు.
ఈ క్రమంలో ఊరిలో జనం అందరూ పట్నం బాట పట్టడంతో వారిని కార్తీక్ ఎలా ఆపాడు? కార్తీక్ పల్లెటూరికి రావడానికి అసలైన కారణం ఏంటి? అతడు వ్యవసాయంలో ఎంత మేర రాణిస్తాడు? మధ్యలో గ్రామస్తులతో వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించాడు? చివరికి ఏకాంబరం ఏమవుతాడు? ఉమ్మడి వ్యవసాయం ద్వారా ఎలాంటి ఫలితాలను అందుకున్నారనేది తెరపై చూడాలి.
Movie Analysis
ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమా కథ అందరికి తెలిసిన సాధారణ కథ. అయితే, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మనకు మరోసారి కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టారు చిత్ర యూనిట్. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరీ వ్యవసాయం కోసం ఊరుకి వచ్చిన కొడుకుకి, తండ్రికి మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
సినిమా శర్వా కి కలిసి వచ్చిన సంక్రాంతి పాటతో మొదలవడం సినిమాపై ఆసిక్తిని పెంచుతుంది. ఆ తరువాత సిటీ వాతావరణం, హీరో హీరోయిన్ ప్రేమ ఆ తర్వాత పరిణామాలతో హీరో గ్రామానికి చేరుకోవడంతో ఫస్ట్ ఆఫ్ నడిపించారు. శర్వా మరియు ప్రియంకాల నడుమ మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. మిగతా అంతా ఎక్కువ ఎమోషనల్ గా చూపించారు.
శర్వా వ్యవసాయంపై తీసుకున్న స్టెప్ తో సెకండ్ ఆఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. అందుకు తగ్గట్టే సెకండ్ ఆఫ్ అంతా రైతులు, వ్యవసాయం చుట్టూనే కథ సాగుతుంది. శర్వా మరియు గ్రామస్తులంతా ఉమ్మడి వ్యవసాయం అనే ఒక భారీ ప్రయత్నం చేసే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
రైతులంతా కలిసి పని చేయడం, ఫలితాన్ని అందుకోవడం ఎమోషనల్ గా మెప్పిస్తాయి. ఆ తర్వాత ప్రపంచాన్ని వణికించిన కరోనా మరింత ఇబ్బంది లో పడేసే సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. రైతులకు, హీరోకి మధ్య అభిప్రాయ భేదాలు రావడం ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే ఒకే పాయింట్ మీద సెకండ్ ఆఫ్ సాగడం కొంచెం లెంత్ గా అనిపిస్తుంది. అయితే వాటిని పాజిటివ్ గా తీసుకొని ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయితే సినిమా అందరికీ చేరినట్టే. ఇక ప్రధానంగా తండ్రి కొడుకుల బంధాన్ని బాగా చూపించారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే సినిమాను శర్వానంద్ వన్ మెన్ షో గా మార్చుకున్నాడని చెప్పవచ్చు. సిటీలో లవర్ బాయ్ గా గ్రామంలో రైతుల కష్టాలకు చలించి వారితో కలిసి నడిచే యువకుడిగా మంచి నటనను కనపరిచాడు. అలాగే అతనికి సమానం అయిన పాత్రలో రావు రమేష్ చాలా అద్భుతంగా నటించారు. ప్రియాంక తన అందంతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో వడ్డీ వ్యాపారిగా సాయి కుమార్ నటన బాగుంది. ఇక వ్యవసాయం గురించి శర్వానంద్ చెప్పే మాటలు ఆకట్టుకుంటాయి.
సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరీ వ్యవసాయం కోసం ఊరుకి వచ్చిన కొడుకుకి, తండ్రికి మధ్య వచ్చే సీన్స్ లో రావు రమేష్, శర్వా పోటీపడి నటించారు. ఈ సినిమాలో ఉన్న నటి నటులు వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు అని చెప్పవచ్చు. ఇక సప్తగిరి, సత్య, నరేష్, మురళి శర్మ వంటి వారు తమ పాత్రలకు తగ్గ రీతిలో నటించి మెప్పించారు.
Technical Analysis
ఇక సాంకేతికంగా చూసినట్లు అయితే ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం సినిమాకు బాగా కలిసి వచ్చింది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్లస్ అని చెప్పాలి. నిర్మాణ విలువలు ఈ సినిమాను బాగా రిచ్ గా చూపించాయి.
అలాగే ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంటుంది. దర్శకుడు కిషోర్ రెడ్డి గతంలో శ్రీకారం అనే షార్ట్ ఫిలిం తెరకెక్కించాడు. వ్యవసాయం ఆధారంగా తీసిన దీనికి ప్రశంసలు దక్కాయి. అలాగే దానికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు అదే కథను శర్వానంద్ తో కలిసి ఆ టైటిల్ తోనే సినిమాను రూపొందించారు.
వ్యవసాయం చేసే వాడే లేకపోతే అన్నం తినేది ఎలా? అనే కాన్సెప్ట్ ఈ సినిమాను అందరూ ఆకట్టుకునేలా రూపొందించాడు. అయితే షార్ట్ ఫిలిం కి పెద్ద సినిమా తీయడానికి తేడా ఉంటుందిగా, అదే అక్కడక్కడ నెగిటివ్ గా మారింది. అయితే దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ను మాత్రం చక్కగా అర్ధమయ్యేలా చెప్పగలిగాడు.
మొత్తం చూసినట్లు అయితే శర్వానంద్, రావు రమేష్ యాక్టింగ్, సెకండ్ ఆఫ్ ఎమోషనల్ సీన్స్, వ్యవసాయం పై వచ్చే సీన్స్, క్లైమాక్స్ మెసేజ్ వంటివన్నీ సినిమాను ఆసక్తికరంగా మలిచాయి. అక్కడక్కడ స్లో నారియేషన్ మినహాయిస్తే సినిమా ఓకే అనిపిస్తుంది.
Sreekaram Movie Rating
శ్రీకారం మూవీ రేటింగ్ : 3/5