ఆయన వచ్చి ఏదో చేస్తాడు, ఈయన వచ్చి ఇంకా ఏదో చేస్తాడు, వేచి చూసిన జనం తిరగబడుతున్నారు. పని చేయని నాయకులపై పోటీకి దిగుతున్నారు. పసుపు బోర్డు కోసం రైతులు ఎన్నికల బరిలోకి దిగినట్లే, తమిళనాడులోను అన్నదాతలు అసెంబ్లీ పోరుకు నడుంకట్టారు.

ఏకంగా వెయ్యి మంది అన్నదాతలు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడులోని తిరువూరు జిల్లా, కంగేయం నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడి రైతులు అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 1000 నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

చూసేందుకు నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలులా కనిపిస్తున్న ఇక్కడి రైతుల సంఖ్య అక్కడి కంటే ఎక్కువ. ఇక్కడి రైతులు నీటి కొరతతో చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు‌. పరంబికులమ్-అలియార్ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు, కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు.

దీంతో కొందరు రైతులు ఏకంగా నిరాహారదీక్ష చేశారు. నీటిని విడుదల చేయాలంటూ ఏకంగా అయిదు రోజుల పాటు నిరాహార దీక్ష సాగింది. సీఎం పళనిస్వామి వచ్చి హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు. కానీ డిమాండ్ మాత్రం నెరవేరలేదు.

ఇలా అనేక సార్లు మొత్తుకున్నా కూడా పట్టించుకోకపోవడంతో ఈసారి ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించారు. అందుకే కంగేయం నియోజకవర్గం నుంచి వెయ్యి మందికి పైగా రైతులు పోటీకి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పది మంది రైతులు నామినేషన్ దాఖలు చేశారు. మిగతావాళ్లు అదే పనిలో ఉన్నారు. నిజానికి ఇక్కడ ఇలాంటి ఘటన 1996 లోనూ జరిగింది. మోడకురిచి నుంచి 1033 మంది పోటీ చేశారు, దీనితో ఎన్నికలు నెల పాటు వాయిదా వేశారు.

x