తన తల్లి రోజా రమణి అడుగుజాడలను అనుసరించి, హీరో తరుణ్ ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. ఆహా ప్లాట్ ఫామ్ లో తాజాగా విడుదల అయిన చిత్రం ‘అనుకోని అతిధి’ ఈ సినిమా లో మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ కు తరుణ్ డబ్బింగ్ చెప్పాడు. తరుణ్ ను డబ్బింగ్ ఆర్టిస్టుగా చూడటం అందరికీ పెద్ద ఆశ్చర్యం కలిగిస్తుంది. కొన్ని రోజుల క్రితం, తరుణ్ సినిమాల్లోకి తిరిగి రావడం గురించి అనేక వార్తలు వచ్చాయి కానీ అతను ఇప్పుడు డబ్బింగ్‌ ఆర్టిస్ట్ గా కనిపించాడు.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరియర్ ప్రారంభించిన తరుణ్ టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఎదిగారు. అతను నటించిన సినిమాలు నువ్వు లేక నేను లేను, నువ్వే కావలి, నిన్నే ఇష్టపడ్డాను, ఎలా చెప్పను, ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, సోగ్గాడు, భలే దొంగలు,శశిరేఖ పరిణయం మరియు మరికొన్ని చిత్రాలతో తాను తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. తలపతి, ఆదిత్య 369, అంజలి, అభయం, తేజ, మరికొన్ని చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా నటించారు. తరుణ్ తల్లి రోజా రమణి చాలా సినిమాల్లో నటించింది మరియు తెలుగులో ఆమె స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్.

తెలుగులో తరుణ్ చివరిగా నటించిన చిత్రం 2018 లో విడుదలైన “ఇది నా లవ్ స్టోరీ”. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ప్రస్తుతం తరుణ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను కొనసాగించాలని అనుకుంటున్నాడా లేదా త్వరలోనే నటుడిగా తిరిగి రానున్నాడా చూడాలి.

x