తెలంగాణలోని విద్యాసంస్థల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పాఠశాలల్లో నమోదవుతున్నపాజిటివ్ కేసులతో బెంబేలెత్తిపోతున్నారు. తల్లిదండ్రుల గుండెల్లోనూ దడ పుట్టిస్తున్నాయి. మరోవైపు సిఎస్ విద్యాశాఖ అధికారులతో, సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయడంపై త్వరలోనే ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో కరోనా పంజా విసురుతుంది. వైరస్ వ్యాప్తి తగ్గింది అనుకున్న సమయంలో, పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
గత పది రోజులుగా వైరస్ విజృంభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలలో పాజిటివ్ కేసులు భయపెడుతున్నాయి. దీంతో పిల్లల్ని స్కూలుకి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు.
కరోనా ఎఫెక్ట్ తో చాలా కాలం స్కూల్స్ మూతపడ్డాయి. ప్రత్యాన్మాయంగా ఆన్లైన్ విద్యకు మొగ్గుచూపారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. అంతలోనే కోవిడ్ కేసులు
పెరిగి పోతున్నాయి.
పాఠశాలలు, గురుకుల పాఠశాలలు అనే తేడా లేకుండా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. దీనితో విద్యాసంస్థలు మూసివేయాలని డిమాండ్ ఊపందుకున్నాయి. ప్రస్తుతం బడి పేరు చెప్తేనే తల్లిదండ్రుల్లో, విద్యార్ధుల్లో భయం కనిపిస్తుంది. ఎలాగూ విద్యా సంవత్సరం ముగుస్తుంది, ఇలాంటి సమయంలో పాఠశాలు నడపటం సరికాదని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
గత ఏడాదిలాగే విద్యార్థులను ప్రమోట్ చేయాలని, విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్న అంశంలో తెలంగాణ సర్కార్ కూడా పరిశీలిస్తుంది. పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది, ఆసక్తికరంగా మారింది.