సెప్టెంబర్ 1 నుంచి బడి గంట మోగనుంది. 18 నెలల తర్వాత మళ్లీ స్కూల్స్ ఓపెన్ కానున్నాయి. అయితే, 8వ తరగతి కంటే దిగువ తరగతులకు క్లాసులు నిర్వహించే విషయంపై అభ్యంతరాలు వస్తున్నాయి. ఎటువంటి కోవిడ్ నిబంధనలను పాటించాలో తెలపకుండా స్కూల్స్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 5,526 ప్రైవేట్ స్కూల్స్ మరియు 2,249 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 16 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శానిటైజర్, క్లీనింగ్ గురించి ప్రభుత్వం చెప్పింది. కానీ, స్కూల్స్ నిర్వహణ గురించి మాత్రం సర్కార్ ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు. ప్రైమరీ పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే ప్రశ్నలు ప్రస్తుతం స్కూల్స్ యాజమాన్యాలను వెంటాడుతున్నాయి. సర్కార్ ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వకపోవడంతో కొన్ని స్కూల్స్ పాత పద్ధతినే పాటించాలని భావిస్తున్నాయి. టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్ వ్యాక్సిన్ తీసుకున్నారని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం స్కూల్స్ ప్రారంభం పై విద్యార్థుల తల్లిదండ్రులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా తగ్గినట్లే తగ్గి కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ లోనే క్లాసులు నిర్వహించాలని, ఆపైన విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించిన సరేనని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో స్కూల్స్ రీ ఓపెన్ పై పిటిషన్ దాఖలు అయింది.
ప్రత్యక్ష తరగతుల బోధన పై ప్రైవేట్ టీచర్ బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాబోయే రోజుల్లో కరోనా మూడో దశ మొదలయ్యే సూచనలు ఉన్నాయని వైద్య నిపుణుల హెచ్చరికలను ప్రస్తావిస్తూ పిల్లలకు ప్రత్యక్ష తరగతులు సరికాదని అభ్యంతరం తెలిపారు. హైకోర్టు తాత్కాలిక చీఫ్ జడ్జ్ రామచంద్ర రావు నేతృత్వం లోని బెంచ్ ఈ పిటిషన్ పై రేపు విచారణ చేపట్టనుంది.