పేద వారి యొక్క సొంత ఇంటి కోరిక ఈరోజు నెరవేరబోతోంది. పేదలకు ఇళ్ల పథకం పేరిట ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఈరోజు మొదలుకానుంది. ఇక ఇళ్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ప్రారంభించబోతున్నారు. సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్ విధానంలో ఈ పనులను ప్రారంభించనున్నారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వైసీపీ సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పేదల ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. నవరత్నాల్లో భాగమైన జగనన్న ఇళ్ల నిర్మాణాన్ని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తారు. ఇప్పటికే సుమారు 30 లక్షల మంది పేద వర్గాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం పూర్తి చేసిన ప్రభుత్వం, వారికి ఇళ్లు నిర్మించుకునేందుకు సహకారం కూడా అందించనుంది.
మొదటి విడత లో భాగంగా 15 లక్షల 60 వేల ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 30 వేల కోట్ల వరకు ఖర్చు చేయనుంది. మౌలిక వసతుల కోసం మరిన్ని నిధులు ఇవ్వనుంది. సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి ఉచితంగా ఇసుక, మరియు తక్కువ ధరకే సిమెంట్, ఐరన్ వంటివి సమకూర్చి, కొంత మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది.
ఒకవేళ ఇల్లు కట్టే బాధ్యత ప్రభుత్వానికి అప్పగిస్తే సర్కారే ఇంటిని పూర్తిచేసి అందజేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు కానున్నాయి. పేదవారికి 15 లక్షల విలువైన ఆస్తి ఈ పథకం ద్వారా అందనుంది.