తిరుమల అలిపిరి మెట్ల మార్గాన్ని రెండు నెలలు పాటు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. జూన్ 1 నుంచి జులై 31 వరకు అలిపిరి మెట్ల మార్గాన్ని మూసివేయనున్నట్లు తెలియచేసింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు చాలామంది అలిపిరి మెట్ల మార్గం నుండే కొండపైకి చేరుకుంటారు. భక్తులు పాతల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి, వెంకటేశ్వర స్వామి పాదాలు దర్శించుకోని పైకి ఎక్కడం మొదలు పెడతారు. శ్రీవారి మెట్లు, అన్నమయ్య మార్గాలు అందుబాటులో ఉన్న చాలామంది అలిపిరి మెట్ల మార్గం నుండే తిరుమలకు చేరుకుంటారు. దాదాపు తొమ్మిది కిలోమీటర్ల నడక మార్గంలో కొండపైకి వెళ్లేందుకు 3,550 మెట్లు ఉన్నాయి.
కొన్ని సంవత్సరాల నుండి కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది, దీనితో పాటు 20 ఏళ్ల నుంచి అలిపిరి మెట్ల మార్గం ఆధునీకరణ లేదు. ఈ మార్గంలో చాలా చోట్ల పైకప్పులో చీలిక కనిపిస్తుంది మరియు పలుచోట్ల మెట్లు కూడా దెబ్బతిన్నాయి. దీనితో కాలిబాట మార్గాన్ని ఆధునీకరణ చేయాలనీ టీటీడీ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అలిపిరి నడక దారి మరమ్మత్తు పనులను ప్రారంభించింది.
రిలయన్స్ సంస్థ సహకారంతో దాదాపు 30 కోట్ల నిధులతో ఈ పనులు చేపట్టింది. ప్రస్తుతం ఈ మార్గంలో పైకప్పు ఆధునీకరణ పనులు మినహా అన్ని పనులు దాదాపు పూర్తయ్యాయి. పై కప్పు మరమ్మత్తు పనులను చేపట్టేందుకు జూన్ 1 నుంచి రెండు నెలల పాటు ఈ మార్గాన్ని మూసివేయాలని టీటీడీ నిర్ణయించింది.
కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం నుంచి శ్రీవారి మెట్ల వరకు టీటీడీ రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది. వేగంగా పనులను పూర్తి చేసి ఆగస్టు నెల నాటికి అలిపిరి కాలిబాట మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.